Thursday, July 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకదం తొక్కిన ఆర్టిజన్లు

కదం తొక్కిన ఆర్టిజన్లు

- Advertisement -

మింట్‌ ‌కాంపౌండ్‌ ఎస్పీడీసీఎల్‌ ఆఫీసు ముట్టడి
సర్కార్‌ ‌దిగిరాకుంటే ఆందోళన మరింత ఉధృతం
ఉప ముఖ్యమంత్రి హామీలకే దిక్కులేకుంటే ఎలా? : మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌
తెలంగాణ విద్యుత్‌ ఆర్టీజన్‌ ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక

​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు బుధవారం హైదరాబాద్ లో కదం తొక్కారు. మింట్‌ ‌కాంపౌండ్‌ ‌వద్ద గల ఎస్పీడీసీఎల్‌ ‌కార్యాలయాన్ని వారు ముట్టడించారు. తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆర్టిజన్లు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. విద్యార్హతకు అనుగుణంగా రెగ్యూలర్‌ చేయాలనీ, ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలనీ, విద్యుత్ బిల్‌ కలెక్టర్లకు లేబర్‌ కమిషనర్‌ ఇచ్చిన జీవో నెంబరు 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలనీ, అన్‌మ్యాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్లు, బిల్‌ కలెక్టర్లు, పీస్‌ రేట్‌ వర్కర్లను కన్వర్షన్‌ చేయాలని కోరుతూ ఫ్లకార్డులు, జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మింట్‌కాంపాండ్‌ పరిసరాలు నినాదాలతో మార్మోగాయి. ఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం గేట్‌ ముందు వారు భారీ సంఖ్యలో బైఠాయించడంతో రెండు గంటలకుపైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సెక్రెటేరియట్‌ నుంచి మింట్‌ ‌కాంపౌండ్‌‌కు వెళ్లే రోడ్డును పోలీసులు బారికేడ్లతో మూసేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టిజన్లను రెగ్యూలర్‌ ‌చేయాలని కోరుతూ ఏప్రిల్ 8 నుంచి 17 వరకు 10 రోజులపాటు సమ్మె నిర్వహించామని గుర్తు చేశారు. ఆ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆందోళనను విరమించామని తెలిపారు.

ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ ప్రకారం ఎన్ని సాధ్యమవుతాయో అన్ని డిమాండ్లను అమలు చేస్తామంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మూడు నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే తిరిగి ఆందోళనబాట పట్టామని అన్నారు. ‘ఆర్టిజన్లకు గత ప్రభుత్వం చేసిందే ఎక్కువ… ఇంకా కొత్త డిమాండ్లంటూ ఆందోళన చేస్తే ఉద్యోగం నుంచి అందర్ని తొలగిస్తాం’ అని ఇంధన కార్యదర్శి నవీన్ మిట్టల్ బాధ్యాతారాహిత్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మిమ్మల్ని తీసేసి మీకు ఇచ్చే జీతంతో నలుగురు కాంట్రాక్ట్ కార్మికులను పెట్టి నడిపిస్తామంటూ ఆయన 20 వేల మంది కార్మికుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారని వాపోయారు. ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో విద్యుత్‌ ఆర్టిజన్‌ ‌కార్మికులు ముందుండి పోరాడారని గుర్తు చేశారు. సమ్మె సందర్బంగా ఉపముఖ్యమంత్రి ఇచ్చిన హామీలతో పాటు అన్ని డిమాండ్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సర్కార్‌ ‌దిగి రాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఈఈయూ(సీఐటీయూ) రాష్ర్ట అధ్యక్షులు కె.ఈశ్వర్‌‌రావు, తెలంగాణ విద్యుత్‌ ఆర్టీజన్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్‌ సతీష్ రెడ్డి, కో చైర్మెన్‌ సుదాగని శ్రీధర్ గౌడ్, కన్వీనర్లు ఎస్‌. చంద్రారెడ్డి, చందర్ సింగ్, వైస్ చైర్మెన్లు సంతోష్ నాయక్, చింతల ఎల్లయ్య, జాయింట్ సెక్రెటరీలు ఖాన్, ఎన్ వెంకన్న, పర్శరాములు, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పోరాడితేనే హక్కులు: ‌ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌
లాబీయింగులు, పైరవీలు చేస్తే సమస్యలు పరిష్కారం కావనీ, పోరాడితేనే పరిష్కారమవుతాయని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌కె.నాగేశ్వర్‌ అన్నారు. ఆర్టిజన్లు, అన్‌మ్యాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్లు, పీస్‌ రేట్‌ వర్కర్ల పేరిట కార్మికులను విభజించిన ప్రభుత్వం వారి హక్కులను హరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఆర్టిజన్లకు కనీసం మెటర్నిటీ సెలవు కూడా అనుమతించక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోవటం శోచనీయమని తెలిపారు. ఒక ఆర్టిజన్‌ ఉద్యోగిని తొలగిస్తే నలుగురొస్తారని ఇంధన శాఖ కార్యదర్శి నవీన్‌ ‌మిట్టల్‌ అనడం ఆయన అహంకారానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఐఏఎస్‌ అధికారులు తమ కింద పని చేసే ఉద్యోగులు, సిబ్బంది పట్ల బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. విద్యుత్‌ ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నాగేశ్వర్ డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -