కొనసాగుతున్న ఖాకీ దాష్టీకం
బీహార్‌లో లాఠీచార్జీ, టియర్‌గ్యాస్ ప్రయోగం
ఢిల్లీలో మళ్లీ పోలీసుల కవ్వింపు చర్యలు కోయంబత్తూర్‌లో ఖాకీల జులుం
దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం వెనక్కి తగ్గని సీజేపీ
‘సుప్రీం’ వ్యాఖ్యలపై అభ్యంతరం వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని విజ్ఞప్తి
స్వచ్ఛందంగా జంతర్‌మంతర్‌కు తరలివస్తున్న యువత
లాఠీలతో కుళ్లబొడుస్తున్నా వెనక్కి తగ్గని భావితరం
పోలీసుల లాఠీలు, టియర్‌గ్యాస్, వాటర్‌కెనాన్లు, పిల్లెట్లకు యువతరం తలొగ్గట్లేదు. తమలోని ఆవేశాన్ని ఆశయం కోసం పణంగా పెడుతున్నారు. రాజ్యహింసతో ఒళ్లు హూనం అవుతున్నా, పంటిబిగువున భరిస్తూనే ‘ప్రశ్న’ను బతికిస్తున్నారు. భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మేం చేసిన తప్పేంటి? అని మోడీసర్కార్‌ను నిలదీస్తున్నారు. తాటతీసైనా…యువతరాన్ని తమ దారిలోకి తెచ్చుకోవాలనే కేంద్రం దుర్మార్గ ఆలోచనలు, చేష్టలు బెడిసికొడుతున్నాయి. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న ఢిల్లీలో నిరుద్యోగుల ‘పార్లమెంట్ మార్చ్’ రక్తసిక్తమైన విషయం తెలిసిందే. ఈ చర్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో విద్యార్థులు, యువతరాన్ని అణచివేయడానికి ‘పోలీస్ జులుం’ ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీ తరహాలోనే బీహార్‌లోను బుధవారం విద్యార్థుల నిరసన ప్రదర్శనపై పోలీసులు విరుచుకుపడ్డారు. ప్రదర్శనకారులను లాఠీలతో కుళ్లబొడిచారు. ఆడపిల్లలపై వాటర్‌కెనాన్లతో తట్టుకోలేని ఫోర్స్‌తో నీళ్లు చిమ్మారు.
టియర్‌గ్యాస్ ప్రయోగించారు. అల్లరిమూకలపై ప్రయోగించే ‘పిల్లెట్ల’తో విద్యార్థులపై తుపాకీలు గురిపెట్టారు. అయినా యువతరం మొండిగా, నిరాయుధంగా ‘రాజ్యహింస’కు ఎదురొడ్డి నిలిచింది. ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద పోలీసులు మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌ను కలిసేందుకు పార్లమెంటు సభ్యుల్ని అనుమతించలేదు. ఢిల్లీ ఘటనలపై అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టులు వేసిన పిటీషన్లపై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల్ని సీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. కోయంబత్తూర్‌లో విద్యార్థులపై కేంద్ర బలగాలు విరుచుకుపడ్డాయి. మరోవైపు పార్లమెంటులోనూ ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. దేశంలో రాజ్యహింస పెట్రేగుతున్నా, మోడీ సర్కార్ పట్టింపేం లేనట్టే వ్యవహరిస్తోంది. దీన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నీట్ ప్రశ్నాపత్రం లీక్, సీబీఎస్ఈలో అవకతవక లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత చేస్తున్న ఆందోళన తీవ్రతరం అవుతోంది. పోలీసులు, కేంద్ర బలగాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న క్రూరమైన అణచివేత చర్యలను ప్రతిఘటిస్తూ సీజేపీ, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన ఆందోళన బలం పుంజుకుంటోంది. బుధవారం కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జంతర్ మంతర్‌కు ప్రజల ప్రవాహం కొనసాగింది. నిరసనను విచ్ఛిన్నం చేసే లక్ష్యంతో ప్రభుత్వం, పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు, ఇంటర్నెట్ నిషేధాన్ని సైతం అధిగమించి జంతర్ మంతర్‌కు ప్రజలు తరలివచ్చారు. అదే విధంగా జంతర్ మంతర్ వద్దకు చేరుకుని మల్లయోధులు సంఘీభావం తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, పోలీసుల క్రూరత్వానికి ముగింపు పలకాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ పునియా నిరసనలో పాల్గొన్నారు. సీపీఐ(ఎం) సీనియర్ నేత బృందా కరత్, ఎస్కేఎం నేత రాకేష్ తికాయత్ విద్యార్థులకు, యువతకు మద్దతుగా జంతర్‌మంతర్ వద్దకు చేరుకుని ఆందోళనలో భాగస్వామ్యం అయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ, అంతర్జాతీయంగా ఆందోళనలు కొనసాగాయి.
బహిరంగ చర్చలకు డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన ఆపబోమని సీజేపీ ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. నిరసనకారులతో చర్చలకు ప్రభుత్వం మరోసారి అంగీకరించినప్పటికీ, జెపి నడ్డా నివాసంలో చర్చలకు తాము సిద్ధంగా లేమని సీజేపీ స్పష్టం చేసింది. నిరసన కేంద్రంలో గానీ, జంతర్ మంతర్ సమీపంలో గానీ చర్చలు జరపవచ్చని సీజేపీ తెలిపింది. అంతేతప్ప వ్యక్తుల నివాసాల్లో, కార్యాల యాల్లో చర్చలకు తాము సిద్ధంగా లేమని, చర్చలు బహిరంగంగానే జరగాలని చెప్పింది.
సోనమ్ వాంగ్ చుక్‌ను కలవకుండా
ఎంపీలను అడ్డుకున్న పోలీసులు
సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష బుధవారానికి 26 రోజులు పూర్తి చేసుకుంది. వాంగ్‌చుక్ ప్రస్తుతం మేదాంత ఆస్పత్రిలో ఉన్నారు. పార్లమెంటు మార్చ్‌లో పాల్గొన్న నిరసనకారులపై చట్టపరమైన చర్యలను ఉపసంహరించుకుని, అణచివేత చర్యలను ఆపితే తాను నిరాహార దీక్షను విరమిస్తానని వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రధాన్ రాజీనామాను పరిశీలిస్తామని, పార్లమెంటులో సవివరమైన చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్ తనకు హామీ ఇచ్చారని వాంగ్‌చుక్ వెల్లడించారు.
ఆందోళనను అణచివేసేందుకు కేంద్రం కుట్రలు
ఆందోళనను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అందులో భాగంగా ఢిల్లీలో ఇంటర్నెట్ ను నిషేధించారు. అనేక ప్రధాన రహదారులను బారికేడ్లతో దిగ్బంధించారు. బుధవారం పదహారు మెట్రో స్టేషన్లను మూసివేశారు. నిరసనకు వస్తున్న యువకులను భయపెట్టి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆందోళనను అణచివేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి 20 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలను ఢిల్లీకి రప్పించారు. ఇదిలా ఉండగా, 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిషేధించారు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవ్వడంతో మళ్లీ నిషేధాన్ని ఎత్తివేశారు. సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వాట్సాప్ ఖాతాను మెటా బ్లాక్ చేసింది. నిరసనను చెడుగా చిత్రీకరించే కంటెంట్‌ను పోస్ట్ చేస్తే రూ.40,000 జరిమానా విధిస్తామని కేంద్ర ప్రభుత్వ పిఆర్ బృందం కంటెంట్ క్రియేటర్లకు సందేశం పంపింది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలని కూడా వారిని కోరారు. జంతర్ మంతర్ వద్ద పోలీసుల అణచివేతకు సంబంధించి టిఎంసి నేత సాకేత్ గోఖలే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుంది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సీజేపీ అసంతృప్తి
జాతీయ స్థాయి పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థులు చేపట్టిన ‘చలో పార్లమెంట్’ నిరసన సందర్భంగా పోలీసుల చర్యను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ తరపు న్యాయవాది ఈ అంశాన్ని ప్రస్తావించగా.. “మా సమయం వృథా చేయొద్దు” అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అనంతరం పిటిషన్‌ను తిరస్కరించారు. దీనిపై స్పందించిన సీజేపీ సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.పాట్నాలో ప్రజాగ్రహం
నీట్ ప్రశ్నాపత్రాల లీక్ అంశం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విద్యార్థుల ఉద్యమాలను అణచివేయాలని మోడీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు మరింత అగ్గి రాజేస్తున్నాయి. బుధవారం బీహార్ రాజధాని పాట్నాలో నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు భారీ సంఖ్యలో ‘లోక్ భవన్ మార్చ్’ నిర్వహిం చారు. గాంధీ మైదాన్ సమీపంలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలపై , విద్యార్థుల తల్లిదండ్రులపై పోలీసులు విరుచుకుపడ్డారు. బారికేడ్లతో అడ్డుకోవటానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో లాఠీచార్జీ చేశారు. దొరికిన వారిని దొరికినట్టు లాఠీలతో బాదారు. అప్పటికీ శాంతించని పోలీసులు పెల్లెట్లు ప్రయోగిం చారు. వాటర్ కెనన్లనూ ప్రయోగించారు. దీంతో విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.
నీట్ రద్దు పై భగ్గుమన్న తమిళనాడు
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, న్యూఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న విద్యార్థు లను విడుదల చేయాలని డిమాండ్ లు ఉధృతమవుతు న్నాయి. తమిళనాడు కోయంబత్తూర్ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) ,స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) సభ్యులు బుధవారం నిరసన చేపట్టారు.రద్దు చేయాలన్న తమ డిమాండ్‌ను నిరసనకారులు పునరుద్ఘాటించారు . కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుప్పూర్ లోనూ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాన తపాలా కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మకు నిప్పుపెట్టినందుకు తిరుప్పూర్ నగరంలో ఎస్ఎఫ్ఐ , డీవైఎఫ్ఐ సభ్యులను అరెస్టు చేశారు.



