Thursday, July 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసీసీఐ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటీ?

సీసీఐ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటీ?

- Advertisement -

సీఎం రేవంత్‌‌రెడ్డికి కేటీఆర్‌ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‌ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరేంటో స్పష్టం చేయాలని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బుధవారం లేఖ రాశారు. ఆదిలాబాద్ అభివృద్ధికి సీసీఐ పునరుద్ధరణ ఎంతో కీలకమని తెలిపారు. రూ.250 కోట్ల రాష్ట్ర వాటాతో పునరుద్ధరణ సాధ్యమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడమే ఈ జాప్యానికి కారణమని విమర్శించారు. పునరుద్ధరణపై సీఎం రేవంత్‌‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆదిలాబాద్ ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి ప్రతిపాదనలు పంపిందని ప్రశ్నించారు. రూ.250 కోట్లను రాష్ట్ర వాటాగా పెట్టుబడి పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా, లేదా స్పష్టం చేయాలని కోరారు. సీసీఐ పునరుద్ధరణ కోసం టీఎస్-ఐపాస్ తరహా రాయితీలను వర్తింపజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమేనా?అని అడిగారు. అవసరమైతే కేంద్ర-రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో పరిశ్రమ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా?అని తెలిపారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఈ పరిశ్రమను పునరుద్ధరించే కార్యాచరణ ప్రణాళిక ఏమైనా ఉందా?అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయాలకు అతీతంగా ఈ అంశంపై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రaభుత్వానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలనీ, సీసీఐ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డితోపాటు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమయం కేటాయిస్తే, సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -