మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కొన్ని సమస్యలపై అక్కడికక్కడే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖాముఖిలో ఎక్కువ దరఖాస్తులు ఇండ్లు కోరుతూ వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం రెండు విడతల్లో మొత్తం 7 లక్షల ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు. పేదలు నివసించే చోటే నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు నిర్మించబోయే ఇండ్ల విలువ రూ.40 లక్షల నుంచి కోటి రూపాయిల వరకు ఉంటుందనీ, ఇంటిస్దలంలో వాటా కూడా కల్పిస్తున్నామని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్‌గా 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఈ ఇండ్ల కోసం మీ సేవ, వాట్సాప్, వెబ్సైట్ ద్వారా మరో సారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నీట్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
పాత్రికేయులపై బీజేపీ దాడి సరికాదు : ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్
పాత్రికేయులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు దాడి చేశారని రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన లెజెండ్ టీవీ జర్నలిస్ ప్రవీణ్ ను కేర్ ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రవీణ్ వైద్య ఖర్చులతో పాటు వారు కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. పోలీసుల ముందే ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని తప్పుపట్టారు. వారి దాడుల సంస్కృతిని దేశం గమనిస్తుందని హెచ్చరించారు. నీట్ అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. ప్రధాని క్షమాపణ చెప్పాలనీ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ నేతల నిరసన కార్యక్రమం కవర్ చేయడానికి వచ్చిన ప్రవీణ్ పై వారు దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైనట్టు తెలిపారు.



