ఏటా 13 నుంచి 14 వేల మంది బయటకు
విద్యార్థులకు ఉపకారవేతనం అభినందనీయం : ఏఐజీఎన్ఎఫ్, యూఎన్ఏ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నర్సింగ్ విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ మారిందని ఆలిండియా గవర్నమెంట్ నర్సెస్ ఫెడరేషన్(ఏఐజీఎన్ఎఫ్) ప్రధాన కార్యదర్శి అనిత పన్వార్, యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్ అధ్యక్షులు జాస్మిన్షా అన్నారు. తెలంగాణ నుంచి ఏటా 13 నుంచి 14 వేల మంది నర్సింగ్ విద్యను పూర్తిచేసుకుని బయటకు రావడం, నర్సింగ్ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం అభినందనీమన్నారు. నర్సింగ్ విద్యను ప్రోత్సహిస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ (ప్రభుత్వ) నర్సెస్ అసోసియేషన్ ప్రతినిధులతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనిత పన్వార్ మాట్లాడుతూ ..దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నర్సింగ్ ఆఫీసర్లు గౌరవప్రదమైన స్థానం పొందాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి నర్సింగ్ ఆఫీసర్ల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయమని కొనియాడారు. నర్సింగ్ వృత్తిలో మహిళలతో పాటు పురుషులు కూడా సమానంగా సేవలందిస్తున్నందున ఉద్యోగోన్నతుల విషయంలో ఉన్న జీవోలను సవరించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. జాస్మిన్ షా మాట్లాడుతూ..ఒకప్పుడు శిక్షణ పొందిన నర్సులు అంటే కేరళ గుర్తుకు వచ్చేదనీ, నేడు తెలంగాణ గుర్తుకొస్తున్నదని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం 10 వేలకుపైగా నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయడం ద్వారా వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించడమే కాకుండా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడిందన్నారు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ కాంట్రాక్ట్ విధానంలోనే నర్సులను నియమిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం రెగ్యులర్ నియామకాలు చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఈ సమావేశంలో తెలంగాణ (ప్రభుత్వ) నర్సస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కృష్ణ పాల్గొన్నారు.
నర్సింగ్కు కేరాఫ్ తెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



