Thursday, July 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌‌తో ముడిపెట్టొద్దు

మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌‌తో ముడిపెట్టొద్దు

- Advertisement -

వెంటనే విధివిధానాలు రూపొందించి అమలు
చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ
ఐద్వా, పీఓడబ్ల్యూ, సీఎంఎస్, ఎన్ఎఫ్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ


నవతెలంగాణ -సుల్తాన్ బజార్
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలును జనగణన, డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం తగదని, చట్టసభల్లో విధివిధానాలు రూపొందించి చట్టాన్ని వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలు కోసం ఐద్వా, పీఓడబ్ల్యూ, సీఎంఎస్, ఎన్ఎఫ్‌డబ్ల్యూ తదితర మహిళా సంఘాల ఆధ్వర్యంలో మూడ్రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో భాగంగా బుధవారం హైదరాబాద్‌ గన్‌పార్క్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా జాన్‌‌వెస్లీ మాట్లాడుతూ.. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2023లో చట్టం చేసినప్పటికీ నేటికీ అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. చట్టం వెంటనే అమలైతే ప్రస్తుతం పార్లమెంట్‌లో 180 మంది మహిళా ఎంపీలు ఉండేవారని, కానీ ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం 13 శాతానికి మాత్రమే పరిమితమైందని విచారం వ్యక్తం చేశారు. వామపక్షాలు, ప్రతిపక్షాలన్నీ జనగణన, డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతున్నాయనీ, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటితో ముడిపెట్టడం సరైన విధానం కాదని అన్నారు. మహిళల ఐక్య పోరాటానికి సీపీఐ(ఎం) పూర్తి మద్దతిస్తుందని, రిజర్వేషన్లు అమలయ్యే వరకు ఉద్యమానికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

ఆటంకాలు సృష్టించడం మహిళలను వంచించడమే
30 ఏండ్లుగా ఎన్నో పోరాటాలు చేసి చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించుకుంటే ఆ చట్టాన్ని అమలు చేయకుండా కేంద్రం జనగణన, డీలిమిటేషన్ పేరుతో ఆటంకాలు సృష్టించడం మహిళలను వంచించడమేనని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు అనసూయ అన్నారు. ఇప్పటికైనా రిజర్వేషన్లను అమలు చేయడానికి వెంటనే తగిన విధివిధానాలను ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రూపొందించాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శశికళ మాట్లాడి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సహాయ కార్యదర్శులు కేఎన్ ఆశాలత, కే నాగలక్ష్మి, ఉపాధ్యక్షులు ఎం. వినోద, వై. వరలక్ష్మి, రాష్ట్ర నాయకులు ప్రీతి, ఎండీ షబానా బేగం, ఆర్ లక్ష్మీదేవి, నాయకులు భారతి, కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -