తక్షణం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
ఢిల్లీలో యువతపై దాడి చేసిన పోలీసులపై సమగ్ర విచారణ చేయాలి
డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్ బంద్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఢిల్లీలో విద్యార్థులు, యువతపై దాడి చేసిన పోలీసులపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ ఈనెల 24న జరిగే విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్ డిమాండ్ చేశాయి. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం బంద్‌కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయా సంఘాల నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ కుంభకోణంతో 21 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే వరుసగా జాతీయస్థాయి ప్రమాణాలు కలిగిన పరీక్షల పేపర్లు లీకేజీలు అవుతున్నాయని చెప్పారు. విద్యార్థులు నష్టపోతున్నా ఇప్పటివరకు ప్రధాని మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థి, యువత పట్ల కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం దుర్మార్గమన్నారు. శాంతియుతంగా జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన విద్యార్థి, యువతపై విచక్షణరహితంగా కేంద్ర ప్రభుత్వం పోలీసులచే లాఠీచార్జీలు, భాష్ప వాయుగోళాలు, వాటర్ కెనాన్లు ప్రయోగించి దాడులు చేయించి తీవ్రంగా గాయపరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన పోలీసులపై విచారణ చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలన్నారు. శుక్రవారం విద్యార్థి సంఘాలు నిర్వహించే విద్యాసంస్థల బంద్‌లో యువత, ప్రజలు, మేధావులు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజాస్వామ్యవాదులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర, పీవైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కృష్ణ, ఏఐవైఎఫ్ నాయకులు సత్య, శ్రీకాంత్, డీవైఎఫ్‌ఐ నాయకులు జావీద్, హస్మీ, దేవేందర్, పీవైఎల్ నాయకులు కె.కిరణ్, రాజు, కార్తీక్, సుధాకర్ పాల్గొన్నారు.
రేపు విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



