కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
ఢిల్లీలో కాంగ్రెస్ నేతల అరెస్టుకు ఖండన
రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, నేతల ధర్నాలు
కరీంనగర్‌లో కేంద్ర మంత్రి కార్యాలయ ముట్టడికి యత్నం
లాఠీచార్జీ.. ఎమ్మెల్యేల అరెస్ట్
నవతెలంగాణ- విలేకరులు
విద్యావ్యవస్థలో లోపాలు, నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ధర్నాలు చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ తదితరుల అరెస్టును ఖండిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎంపీల అరెస్టులను ఖండించారు. ఈ క్రమంలో కరీంనగర్‌లో కేంద్ర మంత్రి కార్యాలయం ముట్టడికి యత్నించగా.. పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి అరెస్టు చేశారు.
మంచిర్యాల జిల్లా పరిధిలోని మందమర్రి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బెల్లంపల్లి, రామకృష్ణా పూర్‌లోనూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలు కండ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టారు. గాంధీ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతర ఎంపీ గోడం నగేష్ ఇంటి ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. పోలీసులు ఆందోళ నకారులను అరెస్ట్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు పాంతాల్లో ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్డులో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఆధ్వర్యంలో, మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్‌లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. నియోజవర్గ కేంద్రాలు, పట్టణాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. శేరిలింగంపల్లిలో పార్టీ నేతలను అరెస్టు చేసి చందానగర్ పీఎస్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ర్యాలీలు తీశారు.
కరీంనగర్‌లో లాఠీచార్జి
కరీంనగర్ నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నేతృత్వంలో కోర్టు చౌరస్తా మీదుగా ఎంపీ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో, బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేసి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఖమ్మంలో..
ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రామ్‌దాస్ నాయక్ ఆధ్వర్యంలో తల్లాడ ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. ఏన్కూర్ ప్రధాన రహదారిపై ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ నేతలు నల్ల కండువాలతో నిరసన తెలిపి, ర్యాలీ నిర్వహిచారు. భద్రాచలం, మణుగూరు అంబేద్కర్ సెంటర్‌లో రాస్తారోకోలు చేశారు.
సూర్యాపేటలో..
ఎన్‌టీఏ నిర్వహిస్తున్న పరీక్షల్లో వరుసగా జరుగుతున్న పేపర్ లీకులు, అవకతవకలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని గుంటూరు మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలోని సృజన స్కూల్ గ్రౌండ్స్‌లో యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగిరెడ్డి మమత సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. యాద్రాదిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



