– ప్రత్యామ్నాయ పంటల సాగుకు అధికారుల సూచన
– గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్
నవతెలంగాణ – రాయపోల్
ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండడంతో వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో రైతులు వరి పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్ అన్నారు. గురువారం రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి, రాయపోల్, తిమ్మక్ పల్లి, రామారం, సయ్యద్‌నగర్, గొల్లపల్లి, టెంకంపేట్ గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన గ్రామసభలను నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రస్తుత వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
అధిక నీటి అవసరం ఉండే వరి సాగుకు బదులుగా జొన్న, సజ్జ, రాగులు, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, నువ్వులు, వేరుశెనగ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే తక్కువ నీటితో మెరుగైన దిగుబడులు సాధించవచ్చని వివరించారు.ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ చెరువులు సబ్సిడీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్షపు నీటిని ఫార్మ్ పాండ్స్‌లో నిల్వ చేసుకోవడం ద్వారా అవసరమైన సమయంలో జీవనాధార నీటిపారుదల అందించి పంటలను కాపాడుకోవచ్చని తెలిపారు. దీంతో ఎల్‌నినో ప్రభావం వల్ల కలిగే నష్టాలను కొంత మేర తగ్గించవచ్చని పేర్కొన్నారు.
రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు మూడు బృందాలుగా అధికారులు గ్రామాల్లో పర్యటించి సమావేశాలు నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ జనార్ధన్ తమ తమ బృందాలతో కలిసి రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ నిర్వహణ, నీటి పొదుపు చర్యలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు.వ్యవసాయ శాఖ సూచనలను రైతులు తప్పనిసరిగా పాటించాలని, నీటిని పొదుపుగా వినియోగిస్తూ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టి ఆర్థిక నష్టాలను నివారించుకోవాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏవో నరేష్, సర్పంచ్లు మాసంపల్లి రాజు, అశోక్ రెడ్డి,శశికాంత్, స్వామి, రూబీన అప్సర్, ఏఈవోలు రజిత, స్వర్ణలత, శిరీష, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్, ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



