నవతెలంగాణ-హైదరాబాద్: విద్యార్థులు జంతర్‌మంతర్ నిరసనలో పాల్గొనవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఢిల్లీ యూనివర్సిటీ (DU), JNU హెచ్చరికలు జారీ చేయడంపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆయా విద్యాసంస్థల ట్వీట్స్‌పై స్పందించిన రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యహక్కులను వినియోగించు కుంటున్న విద్యార్థులను బెదిరించడానికి ఎంత ధైర్యం? అంటూ ఘాటుగా స్పందించారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలు ‘చట్టవిరుద్ధమైన కూడళ్ళు’ (unlawful assemblies) అని, వాటిలో పాల్గొంటే విద్యార్థుల భవిష్యత్తు, అకడమిక్ అవకాశాలు దెబ్బతింటాయని DU, JNU యాజమాన్యాలు హెచ్చరించాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించాయి. కాగా, నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన విద్యార్థి లోకం, శాంతియుతంగా పోరాడుతోంది.



