రాజ్యహింసతో ఆందోళనలను అణచివేయలేమని మోడీ గుర్తించారు : సీపీఐ(ఎం)
ప్రధానకార్యదర్శి ఎం.ఏ బేబీ
తిరువనంతపురం : నీట్ పేపర్ లీక్‌పై విద్యార్ధులు కొనసాగిస్తున్న ఆందోళనలపై ప్రధాని మోడీ స్పందనను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ శుక్రవారం తీవ్రంగా విమర్శించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయాల్సిందిగా ముందు ప్రధాని కోరాలని లేదా ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించాలని అన్నారు. ‘అణచివేత విధానాలతో’ ప్రస్తుతం విద్యార్ధులు, యువత కొనసాగిస్తున్న ఆందోళనలను అణచివేయలేమని ప్రభుత్వం గ్రహించిందని, ఆ తర్వాతనే ప్రభుత్వ ప్రతిస్పందన వెలువడిందని అన్నారు. మొట్టమొదటగా ప్రధాని మోడీ చేయాల్సిందల్లా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరడమే. ఒకవేళ ఆయన రాజీనామా చేయడానికి తిరస్కరిస్తే, ప్రధానే స్వయంగా ఆయనను మంత్రిపదవి నుంచి తొలగించాలన్నారు. అదే విద్యార్ధి-యువత చేపట్టిన ఆందోళన యొక్క కీలక డిమాండ్ అని అన్నారు. అది జరగకుండా, కేవలం చర్చలు జరుపుతామంటూ మోడీ ఏం చెప్పినా కూడా ఫలితం వుండదని బేబీ వ్యాఖ్యానించారు.
నిరసనలపై ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో ఆందోళన జరుపుతున్న విద్యార్ధులపై పోలీసు చర్యలకు దిగడమన్నది అగ్ర నాయకత్వానికి తెలియకుండా జరగదని ఆయన విమర్శించారు. ‘‘ముందుగా, ఆయన ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా వున్నారు? ఢిల్లీ పోలీసులు అత్యంత పాశవికంగా విద్యార్ధుల ఆందోళనలను అణచివేయడానికి ప్రయత్నించారన్నది ప్రధానికి తెలియకుండా వుంటుందని నేననుకోను. నిస్సహాయులైన విద్యార్ధులు, విద్యార్ధినులపై ఇంతటి అమానుషంగా అణచివేతకు దిగడానికి ముందుగానే అమిత్ షా, మోడీని సంప్రదించి వుంటారని కచ్చితంగా చెప్పగలను.’’ అని బేబీ వ్యాఖ్యానించారు.
పేపర్ లీక్‌లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రధాని ఇటీవల చేసిన ప్రకటన, విద్యార్ధి ఉద్యమం కొనసాగుతుందని ప్రభుత్వం గ్రహించిన తర్వాత చేసిన కేవల నామ మాత్రపు సయోధ్య ప్రతిపాదన మాత్రమేనని బేబీ పేర్కొన్నారు. ‘‘తాము తీసుకుంటున్న అణచివేత చర్యలు, విధానాలతో విద్యార్ధి, యువత ఉద్యమాలను, ఆందోళనలను అణచివేయలేమని గ్రహించిన ఫలితమే ప్రధాని మోడీ చేసిన ఈ ప్రతిపాదన. ఇది ముందుకు కదలాలి.’’ అని ఆయన పేర్కొన్నారు.
26 రోజుల పాటు సాగించిన నిరాహార దీక్షను సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ముగించడంపై మాట్లాడుతూ, ఆందోళనకారులు చేసిన డిమాండ్లలో కొన్నింటిపై ప్రభుత్వం నుండి హామీలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన విద్యార్ధుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం, హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారన్న వారు మినహా మిగిలిన విద్యార్ధులపై కేసులు నమోదు చేయబోమని, అలాగే ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చిస్తామని ప్రభుత్వం హామీలివ్వడంతో దీక్ష విరమించారన్నారు. ‘‘ఆందోళనలు ప్రారంభమైన తదుపరి దశలో సోనమ్ వాంగ్‌చుక్ ఈ పోరులో పాల్గొన్నారు. సంఘీభావాన్ని ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలన్నది కీలకమైన డిమాండ్ అయినప్పటికీ ఆయన చేసిన ఇతర డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించడానికి ప్రభుత్వం తరపున జె.పి.నడ్డా అంగీకరించారు. వాటిల్లో విద్యార్ధుల కుటుంబాలకు నష్టపరిహారమివ్వడం, హింసాత్మక ఆందోళనల్లో పాల్గొన్న వారిపై మినహా మిగిలిన విద్యార్ధులపై కేసులు నమోదు చేయకపోవడం, పార్లమెంట్‌లో చర్చ వంటివి వున్నాయి. దాంతో ఆయన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు.’’ అని చెప్పారు. పైగా ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో విద్యా శాఖ కార్యదర్శి వినీత్‌జోషిని మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా బేబీ ప్రశ్నించారు. రాజకీయ బాధ్యత అనేది అధికారులపై కన్నా మంత్రులపై వుంటుందని అన్నారు. ‘‘వారందరూ కేవలం మంత్రుల ఉద్యోగులు మాత్రమే. తమ ఆదేశాలను అమలు చేసిన ఆ ఉద్యోగులను త్యాగం చేయాలని వారెలా కోరుకుంటారు? రాజకీయ బాధ్యత అంటే మంత్రుల బాధ్యత.’’ అని ఆయన అన్నారు.
ఇప్పుడు తెలిసొచ్చింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



