రూ.8,500 కోట్ల పవర్ ట్రాన్స్‌మిషన్ ఆర్డర్
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో కీలక విద్యుత్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఈఎస్‌ఎల్) దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన టారిఫ్ బేస్డ్ కాంపిటీటివ్ బిడ్డింగ్ (టీబీసీబీ) విధానం ద్వారా ఈ అంతర్‌రాష్ట్ర ప్రాజెక్టును సొంతం చేసుకున్నట్టు ఆ కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ తాజా ప్రాజెక్టు అంచనా విలువ సుమారు రూ.8,500 కోట్లుగా ఉంది. దీనితో కంపెనీ చేతిలో ఉన్న మొత్తం ఆర్డర్ల విలువ రూ.80,000 కోట్లకు పైగా చేరింది. విశాఖపట్నం ప్రాంతంలో ప్రతిపాదిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ ప్రసార వ్యవస్థను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. సుమారు 4,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను తీర్చే సామర్థ్యంతో పాటు పెందుర్తి–విశాఖ ప్రాంతంలో వేగంగా పెరుగుతున్న డేటా సెంటర్లు, ఇతర డిజిటల్ మౌలిక వసతుల విద్యుత్ అవసరాలను కూడా ఇది తీర్చనుందని ఆ కంపెనీ తెలిపింది.
ఈ ప్రాజెక్టును వైజాగ్ పవర్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ద్వారా అమలు చేయనున్నారు. ఇందులో విశాఖలోని పెందుర్తిలో, ఖమ్మం-2 వద్ద 765/400 కెవి సబ్‌స్టేషన్లు నిర్మించడంతో పాటు 1,582 సర్క్యూట్ కిలోమీటర్ల కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు, 10,500 ఎంవిఎ అదనపు ట్రాన్స్‌ఫర్మేషన్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు పూర్తి తర్వాత అదానీ ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ 29,531 సర్క్యూట్ కిలోమీటర్లకు విస్తరించనుంది.
ఈ ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా రంగాల అభివృద్ధికి అవసరమైన విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న పారిశ్రామిక, డిజిటల్ పెట్టుబడులకు కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సీఈఓ కందర్ప్ పటేల్ పేర్కొన్నారు.
ఏపీలో అదానీకి భారీ ప్రాజెక్టు
- Advertisement -
- Advertisement -



