ఆయన్ను ఐసీసీకి అప్పగించాలి : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
లండన్, న్యూయార్క్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అరెస్టు చేసి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ముందు హాజరుపరచాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సీనియర్ అధికారి ఎరికా గువేరా రోసాస్ డిమాండ్ చేశారు. నెతన్యాహు అమెరికా పర్యటనకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకోవాలని ఇటీవల న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలకు ఆమె మద్దతు తెలిపారు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో పరిశోధన, న్యాయవాదం, విధానాలు, ప్రచారాల విభాగం సీనియర్ డైరెక్టర్‌గా ఉన్న ఎరికా గువేరా రోసాస్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందిస్తూ.. అమెరికా అధికారులు మానవ హక్కులను, చట్ట పాలనను గౌరవించాలని కోరారు. నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత దేశాలపై ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. 2024లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం విదితమే. గాజాలో జరిగిన యుద్ధానికి సంబంధించి యుద్ధ నేరాలు చేసినట్టు ఆరోపణలు నమోదు చేసింది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయిల్ ప్రభుత్వం ఖండిస్తూ వచ్చింది. అలాగే ఐసీసీ అధికార పరిధిని కూడా ఇజ్రాయిల్ అంగీకరించడం లేదు. నెతన్యాహుపై ఐసీసీ వారెంట్ అమలు చేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మళ్లీ డిమాండ్ చేయడంతో గాజా యుద్ధానికి సంబంధించిన అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కులు, యుద్ధ నేరాల అంశాలు మరోసారి చర్చకు వస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
నెతన్యాహును అరెస్టు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



