ఉద్యమ తీవ్రతకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ రాబోయే పోరాటాల్లోనూ ముందుండాలని పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నీట్ పేపర్ లీకేజీ పట్ల మోడీ ప్రభుత్వ నిరంకుశ పాలనపై దేశ యువత, విద్యార్థులు చారిత్రాత్మక విజయం సాధించటం అభినందనీయమని సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సుమారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిందనీ, ఫలితంగా 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమాలకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువజనులు 36 రోజులుగా నిరవధిక ఆందోళన చేసినప్పటికీ కేంద్రం మొండిగా వ్యవహరించిందని తెలిపారు. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనను అణచివేసేందుకు ప్రభుత్వం తీవ్ర అనాగరిక పద్ధతులకు పాల్పడిందని పేర్కొన్నారు. నిరసన శిబిరాల్లో ఇంటర్నెట్, తాగునీరు, భోజన సౌకర్యాలను నిలిపివేసి, టెంట్లను కూల్చివేస్తూ, వర్షంలో తడిచేలా చేసిందని తెలిపారు. పోలీసులు… యువత తలలు పగిలేలా విచక్షణా రహితంగా లాఠీచార్జీ చేశారని వాపోయారు.
యువతుల దుస్తులు చించి తీవ్రంగా అవమానించే స్థాయికి పరిస్థితి దిగజారిందని విమర్శించారు. విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించి, వారిని ‘దేశద్రోహులు’గా చిత్రీకరిస్తూ భయభ్రాంతులకు గురిచేసేలా ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, యువత వెరవకుండా పోరాటం కొనసాగించిందని కొనియాడారు. ఈ ఉద్యమ తీవ్రతకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించక తప్పలేదని తెలిపారు. ఇది విద్యార్థి లోకం సాధించిన గొప్ప విజయంగా వెస్లీ అభివర్ణించారు. దేశం కోసం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న యువత నేడు భారతావనికి ఆశాకిరణంగా మారుతోందని పేర్కొన్నారు. ఈ ఒక్క సమస్యకే పరిమితం కాకుండా దేశాన్ని పట్టి పీడిస్తున్న దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా నడుం బిగించి, రాబోయే పోరాటాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ అణచివేతను లెక్కచేయకుండా పోరాటంలో పాల్గొన్న విద్యార్థులకు, యువకులకు, వారికి పూర్తి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు.



