విద్యార్థి యువజనులకు సీపీఐ(ఎం) అభినందనలు
ఎన్టీఏను రద్దు చేయాలి..
పరీక్షలను వికేంద్రీకరించాలి : పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ, : ప్రశ్నాపత్రాల లీకేజీలపై జవాబుదారీతనం కోరుతూ దేశవ్యాప్తంగా పోరాడిన విద్యార్థులు, యువతకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్‌బ్యూరో అభినందనలు తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత విషాదకరమని పేర్కొంది. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, విద్యార్థులు, యువత ప్రదర్శించిన అచంచల సంకల్పం, త్యాగాల వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపింది. వివిధ వర్గాల ప్రజల మద్దతుతో, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిపాలన యంత్రాంగం అమలు చేసిన లాఠీచార్జీలు, ఇతర నిర్బంధ చర్యలను ఎదుర్కొంటూనే వారు తమ ఉద్యమాన్ని కొనసాగించారని పేర్కొంది. యువత ప్రదర్శించిన ధైర్యం, పట్టుదల భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు శుభసూచకమని వ్యాఖ్యానించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అది ఒక్కటే సరిపోదని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలకు ప్రధాన బాధ్యత వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే పరీక్షల నిర్వహణను వికేంద్రీకరించాలని కోరింది. వాణిజ్యీకరణ, కేంద్రీకరణ, మతతత్వీకరణను ప్రోత్సహిస్తున్న జాతీయ విద్యా విధానం–2020 (ఎన్ఈపీ–2020)ను కూడా రద్దు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ చర్యలు తీసుకోనంత వరకు ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యార్థుల పట్ల అన్యాయం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించింది. విద్యార్థులు, యువజన ఉద్యమాలు తమ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ డిమాండ్ల సాధన కోసం మరింత విస్తృతంగా ఉద్యమాలు, ఆందోళనలు కొనసాగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.



