– ఎల్‌నినో ప్రభావంపై రైతులకు మంత్రి తుమ్మల సూచనలు
– 50 శాతం రాయితీపై అపరాల విత్తనాల పంపిణీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
రైతులకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, పంటల నిర్వహణపై అవగాహన కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం మంగళవారం నాటికి 100 వ ఎపిసోడ్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా, అశ్వారావుపేట రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. స్థానిక రైతు వేదికలో ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) పెంటేల రవికుమార్, మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని, నీటి లభ్యతపై ప్రభావం పడుతుందని రైతులకు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బోరు మోటార్ల ఆధారంగా కూడా వరి సాగు చేపట్టకుండా, అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు.
అనంతరం ఆత్మనిర్భర్ భారత్ మిషన్ ఆధ్వర్యంలో నందిపాడు, ఆనంతారం గ్రామాల రైతులకు 50 శాతం రాయితీపై మినుములు, పెసర, కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అపరాల సాగు వైపు మొగ్గుచూపాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో సెరికల్చర్ శాఖ అధికారి రామయ్య తమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, ప్రోత్సాహక కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, ప్యాక్స్ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ, వ్యవసాయ సహాయ సంచాలకులు పి. రవికుమార్, మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాసరావు, పశువైద్య అధికారి డా. వినయ్, ఉద్యాన విస్తరణ అధికారి ఈశ్వర్, సెరికల్చర్ అధికారి రామయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు సతీష్, భాను, రవీంద్ర, ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.



