న్యూఢిల్లీ : నిబంధనలను ఉల్లంఘించిన కారణంతో గతంలో పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పిపిబిఎల్) లైసెన్స్‌ను రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఆదేశాలకు మద్దతుగా ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. పిపిబిఎల్‌ను మూసివేయాలని న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. డిపాజిటర్ల ప్రయోజనాలకు భంగం కలిగించేలా బ్యాంక్ వ్యవహారాలు సాగుతున్నాయని గతంలోనే గుర్తించిన ఆర్‌బిఐ.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ సంస్థ బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్-1949, కంపెనీల చట్టం-2013 నిబంధనల ప్రకారం పిపిబిఎల్‌ను రద్దు చేస్తున్నట్లు జులై 8, జులై 22 తేదీల మధ్య ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసినట్లు ఆర్‌బిఐ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రక్రియ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ గిరికుమార్ ఎం. నాయర్‌ను అధికారిక లిక్విడేటర్‌గా కోర్టు నియమించింది. విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటియంకు చెందిన ఈ అనుబంధ బ్యాంక్ గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర నియంత్రణ చర్యలను ఎదుర్కొంటోంది. సాంకేతిక వ్యవస్థలపై ఆడిట్ కోసం 2022 మార్చిలోనే కొత్త కస్టమర్ల చేరికను ఆర్‌బిఐ నిలిపివేయగా, నిబం ధనల ఉల్లంఘనల కారణంగా 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లో డిపాజిట్లు, క్రెడిట్లు, వ్యాలెట్ ట్యాప్ అప్‌లపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. తాజా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం జులై 8వ తేదీ నుంచే పిపిబిఎల్ బోర్డు అధికారుల అధికారాలన్నింటినీ అధికారిక లిక్విడేటర్ తమ చేతులకు తీసుకున్నట్లు ఆర్‌బిఐ స్పష్టం చేసింది.



