Thursday, July 30, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే

రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే

- Advertisement -

విద్యార్థి నేత‌ల‌పై కక్ష‌సాధింపు చ‌ర్య‌లు ఐషీఘోష్‌ అరెస్టు ప్రయత్నం సరికాదు
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించాలి
రాజ్య‌స‌భ‌లో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ డిమాండ్‌
సభలో చర్చించాలంటూ నోటీసులుఢిల్లీ పోలీసుల తీరును ఖండించిన ప్ర‌తిప‌క్షాలు
పార్లమెంటు ఆవరణలో ఆందోళన పాల్గొన్న విప‌క్ష‍ ఎంపీలు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
​సీపీఐ(ఎం) కేంద్ర కార్యాల‌యం (ఏకేజీ భవన్‌)లోకి చొరబడి విద్యార్థి నేత‌ ఐషీఘోష్‌ను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసేందుకు య‌త్నించిన ఢిల్లీ పోలీసుల‌ చర్యను పార్లమెంటులో ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించాల‌ని సీపీఐ(ఎం) రాజ్య‌స‌భ ప‌క్ష‌నేత జాన్ బ్రిట్టాస్ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ ఉద్యమంలో ముందుండి పోరాడిన నాయకురాలు, ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ‌ కార్యదర్శి ఐషీఘోష్‌ను వేటాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కక్షపూరిత చర్యకు వ్యతిరేకంగా, రాజకీయాలకు అతీతంగా పార్లమెంటులో ఆందోళ‌న‌ వెల్లువెత్తింది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర సభ్యులు.. సీపీఐ(ఎం) కేంద్ర‌ కార్యాలయమైన ఏకేజీ భవన్‌లోకి చొర‌బ‌డి, ఐషీఘోష్‌ను అక్రమంగా అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు య‌త్నించ‌డాన్ని తీవ్రంగా విమర్శించారు. వామపక్ష ఎంపీలతో పాటు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), డీఎంకే ఎంపీలు కూడా పార్లమెంటు ఆవ‌ర‌ణలో జరిగిన ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశించి ఐషీఘోష్‌ను పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు చేపట్టిన చర్యపై చర్చించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) లోక్‌సభ నేత‌ కె. రాధాకృష్ణన్, రాజ్యసభ నేత‌ జాన్ బ్రిట్టాస్, ఎంపీ వి. శివదాసన్ సభకు నోటీసులు ఇచ్చారు.

ఐషీఘోష్‌పై చేపట్టిన చర్యలు రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కుల ఉల్లంఘన అని కె. రాధాకృష్ణన్ ఆ నోటీసులో పేర్కొన్నారు. ​రాజ్య‌స‌భ‌లో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ.. ఏకేజీ భవన్‌లోకి చొరబడి ఐషీఘోష్‌ను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసే చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించాలని డిమాండ్ చేశారు. దేశ యువతను భయభ్రాంతులకు గురిచేయాలనే కేంద్ర ప్రభుత్వ ఎజెండాను అమలు చేయడానికి ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఢిల్లీ పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే, వారిని ఎవరూ ఆపి ఉండేవారు కాదని, యూనిఫాం, నేమ్‌ప్లేట్ లేకుండా జాతీయ పార్టీ కేంద్ర కార్యాలయంలోకి చొరబడి జేఎన్‌‌యూఎస్‌‌యూ మాజీ అధ్యక్షురాలిని అరెస్టు చేయడానికి ప్రయత్నించారని జాన్ బ్రిట్టాస్ అన్నారు. జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతున్నప్పుడు పార్లమెంట్ కార్యకలాపాలను ప్రసారం చేస్తున్న సంసద్ టీవీ కెమెరాలు ఆయనపై కాకుండా అధికార పార్టీపై దృష్టి సారించాయి. ఇది నిరసనలకు దారితీసింది. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విషయాలను ప్రతిపక్ష సభ్యులు చెప్పినప్పుడు ప్రజలు చూడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఉందని జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు.

​ప్రజాస్వామ్యం సురక్షితంగా లేదు: ఖర్గే
రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఐషీఘోష్‌పై పోలీసుల చర్యను తీవ్రంగా విమర్శించారు. ‘‘ఢిల్లీ పోలీసుల చర్య సిగ్గుచేటు. పోలీసులు, సీబీఐ ఒక జాతీయ పార్టీ కార్యాలయంపై దాడి చేశారంటే.. ఈ దేశ ప్రజలు, ప్రజాస్వామ్యం సురక్షితంగా లేవని అర్థం. సీపీఐ(ఎం) కార్యాలయంపై దాడి చేసిన పోలీసు అధికారులను శిక్షించాలి. ఇలాంటి పనులు చేయాలని వారికి ఎవరు ఆదేశించారో ప్రభుత్వం వివరించాలి’’ అని ఖర్గే డిమాండ్ చేశారు. దీంతో అధికార పార్టీ సభ్యులు స‌భ‌లో గందరగోళం సృష్టించారు. అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి, స‌భా నాయ‌కుడు జెపి నడ్డా ఢిల్లీ పోలీసుల చట్టవిరుద్ధ చర్యను సమర్థించారు. విద్యార్థి నాయకులు ఏ క్షణంలోనైనా అరెస్టుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

​​పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణలో ఆందోళ‌న‌
ఢిల్లీ పోలీసుల కక్షపూరిత చర్యకు వ్యతిరేకంగా ఎంపీలు పార్లమెంట్ ఆవ‌ర‌ణలో ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఆందోళ‌న‌లో వామ‌ప‌క్ష ఎంపీలు అమ్రారామ్, కె రాధాకృష్ణన్, జాన్ బ్రిట్టాస్, వి. శివదాసన్, పి. సంతోష్ కుమార్, జోస్ కె మణి, రాజా రామ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరిక ఘోష్, జేఎంఎం ఎంపీ మహుమాజీ, డీఎంకే ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. ఐషీఘోష్‌ను లక్ష్యంగా చేసుకున్న కేంద్ర ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు కూడా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపాయి.

​దేశంలో ఎమర్జెన్సీ ఉందా?: ఐషీఘోష్
దేశంలో ఎమర్జెన్సీ ఉందో లేదో కేంద్ర ప్రభుత్వమే నిర్ధారించుకోవాలని ఐషీఘోష్ అన్నారు. ఢిల్లీ పోలీసుల చట్టవిరుద్ధ చర్యలను సమర్థించుకునే క్రమంలో, కేంద్ర మంత్రి జెపి నడ్డా, ఎమర్జెన్సీ సమయంలో తనను అరెస్టు చేశారని, అది సరైనదేనని చెప్పటంపై స్పందిస్తూ.. దేశంలో ఇప్పుడు అత్యవసర పరిస్థితి లాంటిదే నెలకొని ఉందని కేంద్ర ప్రభుత్వమే ధృవీకరిస్తోందా? అని ఐషీఘోష్ విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు.

స‌భ‌ల‌కు మోడీ, అమిత్ షా గైర్హాజరు

జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడి జరిగినప్పటి నుంచి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు పార్లమెంటు ఉభయ సభలకు గైర్హాజరయ్యారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన జులై 20న ఇద్దరూ లోక్‌సభలో హాజరయ్యారు. అదే రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న విద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర సైన్యం పెల్లెట్ గన్‌లతో సహా క్రూరమైన అణచివేతకు పాల్పడ్డాయి. ఈ ఘటన తర్వాత వారిద్దరూ పార్లమెంటు కార్యకలాపాలకు దూరంగా ఉండటం ప్రారంభించటం గమనార్హం.​ వర్షాకాల సమావేశాల మొదటి రోజున మోడీ పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణాత్మక చర్చకు సిద్ధం కావాలని ప్రభుత్వం, ప్రతిపక్షాలను కోరారు. మెరుగైన వర్షాలు కురిస్తేనే మెరుగైన వర్షాకాల సమావేశాలను ఆశించవచ్చని కూడా మోడీ అన్నారు. ఆ తర్వాత లోక్‌సభ సమావేశమైనప్పుడు, ఆయన కొద్దిసేపు హాజరయ్యారు. కొద్దిసేపటికే, విద్యార్థులు, యువ నిరసనకారులు పోలీసు బారికేడ్లను, అణచివేతను అధిగమించి పార్లమెంటు ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు.

అనంతరం పార్లమెంటు చుట్టూ సీఐఎస్ఎఫ్ జవాన్లు బారులు తీరి, నిరసనకారులపై మెషిన్ గన్లు గురిపెట్టారు. ప్రధానమంత్రికి వెంటనే భారీ భద్రత కల్పించి, ఆయన అధికారిక నివాసానికి తరలించారు.​పార్లమెంటు మొదటి రోజున అమిత్ షా కూడా లోక్‌సభకు వచ్చారు. లోక్‌సభలో జనన, మరణ నమోదు సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అప్పటికే, విద్యార్థులు, యువ నిరసనకారులపై పోలీసుల వేట దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో అమిత్ షా కూడా సభ నుంచి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆయన లోక్‌సభకు గానీ, రాజ్యసభకు గానీ రాలేదు. పరీక్షలలో అవకతవకలను నిరోధించే కీలక సవరణ బిల్లు ఆమోదం కోసం పరిశీలనలో ఉన్నప్పుడు మోడీ, షా లోక్‌సభ సమావేశానికి హాజరు కాలేదు. విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి కేంద్ర హోం మంత్రి కూడా అయిన అమిత్ షాకు వ్యతిరేకంగా ఉభయ సభలలో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -