మానవేంద్ర నాథ్ రాయ్ అంటే తెలియని చాలామందికి యం.యన్.రాయ్ అంటే తెలుసు. ఆయన పేరు మాత్రమే తెలిసి ఆయన ఆచరణ గురించి అవగాహన లేని చాలామంది భారతీయుల్లో ఉన్నారు. అంత తేలిగ్గా విస్మరించదగినవాడు కాదాయన.ఆ మాటకొస్తే ఆయన భారతదేశానికి మాత్రమే చెందినవాడు కాదు. ఆయన ఆలోచనలు, రాజకీయ కార్యాచరణ మన దేశాన్ని దాటి ఇతర దేశాలకు విస్తరించిన వైనం ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.1887, మార్చి21న సాంప్రదాయ బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రాయ్ డెహ్రాడూన్‌లో 1954,జనవరి 25న మరణించే వరకు హెచ్బుతగ్గుల ఈ వ్యవస్థను సమూలంగా మార్చడం కోసం వివిధ దేశాలలో,వివిధ స్థాయిలలో పోరాటం జరిపిన తీరు, ఆలోచించిన తీరు ప్రపంచదేశాల అగ్ర నాయకత్వాన్ని ఎల్లప్పుడూ ప్రభావితం చేస్తూనే ఉంటుంది. భారతదేశంతోపాటు మెక్సికో, రష్యా, చైనా వంటి దేశాల రాజకీయ చరిత్రలో విడదీయరాని భాగమైపోయాడు రాయ్. ప్రపంచంలోనే తొలితరం కమ్యూనిస్టుగా నిరంతరం పరిణామశీలతతో తనకాలపు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసినవాడు రాయ్.
1905లో బెంగాల్ విభజన జరిగింది. దానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల ప్రభావం రాయ్ మీద పడింది.ఆయనది మొదటినుంచీ స్వతంత్ర భావజాలం, విప్లవ స్వభావం. అదే సంవత్సరం ఆయన వ్యక్తిత్వానికి సరిపడే ఒక విప్లవ శిబిరంలో చేరాడు. భారత దేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా ఆయుధాల సమీకరణకు బయలుదేరిన రాయ్ అనేక దేశాలలో తాత్కాలికంగా నివాసముంటూ ఆయా దేశాల రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నాడు.ఈ అన్వేషణలో అనేక దేశాలు తిరిగి ఆయుధాల సమీకరణకు గానీ, సాయుధ విప్లవానికి గానీ అనుకూలతలు లేవని గ్రహించి మిత్రుల సలహా మేరకు అమెరికాలో కొంతకాలమున్నాడు. ఇక్కడే ఆయన జీవితం మరోమలుపు తిరిగింది. న్యూయార్క్ నగరంలోనే ప్రవాస జీవితం గడుపుతున్న లాలా లజపతి రాయ్ తో పరిచయం ఏర్పడి ఆయనతో సంభాషణల నేపథ్యంలో ఏర్పడిన అసంతృప్తితో సోషలిస్టు సాహిత్యాన్ని, కారల్ మార్క్స్ రచనలను అధ్యయనం చేయటం ప్రారంభించాడు.
1917లో మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఆయన మీద మోపిన హిందూ జర్మన్ కుట్ర కేసులో భాగంగా అమెరికాలో ఉండలేక మెక్సికో దేశానికి వలస వెళ్లవలసి వచ్చింది.అక్కడి ”ఎల్ పబ్లో”అనే దినపత్రికలో అనేక విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తూ మెక్సికన్ సోషలిస్టు పార్టీలో చేరి త్వరలోనే ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడు.1917 నాటి రష్యా విప్లవ స్ఫూర్తితో ఆ పార్టీని ‘మెక్సికన్ కమ్యూనిస్టు పార్టీ’గా ప్రకటించాడు.ఈ రకంగా రష్యా తర్వాత ఒక దేశంలో మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీని స్థాపించినవానిగా రాయ్ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు.1920లో మాస్కోలో జరిగిన రెండవ అంతర్జాతీయ కమ్యూనిస్టు మహాసభలలో పాల్గొన్నాడు. ఇదే ఊపులో తాష్కెంట్ నగరంలో 1920లో ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా’ను నెలకొల్పాడు.బెర్లిన్ కేంద్రంగా ”వాన్ గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్” అనే పత్రికను నడిపాడు.”సంధి దశలో భారతదేశం” అనే పుస్తకాన్ని రాశాడు.
విదేశాలలో ఉంటూ కూడా భారతదేశం తాలూకు ఆలోచనలు విడిచిపెట్టలేదాయన. రహస్యంగా 1930, డిసెంబరు11 నాడు కరాచీ చేరుకున్నాడు రాయ్. ఎందుకంటే భారత్‌లో 1924లోనే ఆయన మీద ‘కాన్పూర్ కుట్ర కేసు’ మోపారు. దీంతో 1931,జులై 26 నాడు బొంబాయిలో బ్రిటీషు పోలీసులు అరెస్టు చేశారు.పన్నెండు సంవత్సరాల శిక్ష పడితే జడ్జి ముందు తన కేసును తానే వాదించుకొని ఆ శిక్ష కాలాన్ని సగానికి తగ్గించుకున్నాడు.ఆ ఆరు సంవత్సరాల శిక్ష కాలంలో మిత్రుని ద్వారా పుస్తకాలు తెప్పించుకుని విపరీతంగా అధ్యయనం చేశాడు. ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రాలను, సామాజిక శాస్త్రాలను శ్రద్ధగా చదివాడు. రాయ్ ఆలోచనా ధారకు గాఢమైన తాత్వికతను అద్దిన అధ్యయనం ఈ సందర్భంలోనే ప్రభావవంతంగా జరిగింది. ఈ జైల్లోనే అనేక రచనలు కూడా చేశాడు.వాటిలో మనదేశంతో పాటు ఇతర దేశాలమీద చేసిన రచనలు కూడా ఉన్నాయి. తరువాత జాతీయ కాంగ్రెసులో చేరిన రాయ్ అక్కడి నాయకత్వాన్ని, ముఖ్యంగా నెహ్రూను తీవ్రంగా ప్రభావితం చేశాడు.
1939లో రెండవ ప్రపంచయుద్ధం మొదలైంది.అప్పుడు ‘ఇండియా అండ్ వార్’ అనే సిద్ధాంత పత్రాన్ని తయారు చేశాడు.ఈ క్రమంలోనే ఫాసిజం గురించి ఆలోచించి,యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాలను రాబోయే ఫాసిజం ప్రమాదం గురించి హెచ్చరించాడు. యుద్ధ సందర్భంగా కాంగ్రెస్‌తో తలెత్తిన విభేదాలతో బయటకొచ్చాడు.ఆయన ఆలోచనలకు అనుగుణమైన సంస్థను స్థాపించాడు. స్వాతంత్య్రం తరువాత కూడా దేశం ఎలా ముందుకు వెళ్లాలో చర్చిస్తూ ”స్వతంత్ర భారత రాజ్యాంగ ముసాయిదా”, ”భారత దేశ ఆర్థికాభివృద్ధికి ప్రజా ప్రణాళిక” అనే రచనలు చేశాడు. భారత దేశానికి సొంత రాజ్యాంగం ఉండాలని భావించిన మొట్టమొదటి వ్యక్తి రాయ్. 1948లో కలకత్తాలో జరిగిన మహాసభలో రాడికల్ డెమొక్రటిక్ పార్టీని రద్దుచేసి ”రాడికల్ హ్యూమనిస్టు”ఉద్యమాన్ని ప్రారంభించాడు. పార్టీ రాజకీయాలు అధికారం కోసం అంతిమంగా అవినీతికి దారితీస్తాయన సిద్ధాంతం చేశాడు. ఈ విషయం మీద ”రాజకీయం-అధికారం, పార్టీలు” అనే పుస్తకంలో చర్చించాడు.
ఈ రకంగా సాయుధ విప్లవాన్ని కలగన్న ఒకప్పటి రాయ్ క్రమక్రమంగా అనుభవాల ఆధారంగా తన ఆలోచనలను సవరించుకుంటూ చివరికి మానవ వాదిగా పరిణమించాడు. అయితే రాయ్ ఎన్ని దేశాలు తిరిగినా, ఆ దేశ రాజకీయాల్లో క్రియాశీలక భాగస్వామ్యం వహించినా అనునిత్యం భారతదేశం గురించే ఆలోచించేవాడు.నిజానికి ఆయన పొరుగు దేశానికి వెళ్లిందే ఈ దేశాన్ని పరాయి పాలననుంచి విముక్తం చేయటానికి. అందుకే భారత రాజకీయాల నేపథ్యంలో అనేక గ్రంథాలు రచించాడు. కులం గురించి, మతం గురించి ఆయన ఎంతో పురోగామి దృష్టితో విశ్లేషించాడు.
కులం గురించి మాట్లాడుతున్న సందర్భంగా అస్పృశ్యతను కేవలం నిరసన వ్రతంతోనో, సనాతనత్వ అంగీకారంతోనో తొలగించుకోలేమని చెప్తూ ”హిందూ సంఘంలో ఉన్న సనాతనత్వం దానికి ఆధారంగా నిర్మించిన సాంఘిక వ్యవస్థ మారినప్పుడే అస్పృశ్యత తొలగుతుంది”అని హేతుబద్ధంగా ఆలోచించి చెప్పాడు.ఇలా దేని గురించి రాసినా ఆయన మానవవాదిగా ఆలోచించిన తీరే కనిపిస్తుంది. రాయ్ ప్రపంచ స్థాయి నాయకుడైనప్పటికీ రాజకీయ అధికారం ఆశించకుండా మనదేశ పరిస్థితులను మార్చటానికి చిత్తశుద్ధితో రాజకీయ, సామాజిక రంగాల్లో చేసిన కృషి ఈ దేశ నాయకత్వానికి ఎల్లప్పుడూ మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది.
(మార్చి21, ఎం.ఎన్. రాయ్ జయంతి)
తోకల రాజేశం
9676761415



