Saturday, March 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిబడ్జెట్‌లో విద్యకు ప్రాధాన్యతేది?

బడ్జెట్‌లో విద్యకు ప్రాధాన్యతేది?

- Advertisement -

భవిష్యత్తు మానవ వనరుల నిర్మాణంలో విద్యా కీలకమైనది. రాష్ట్ర సామాజిక, ఆర్ధికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా విద్యపై ప్రభుత్వం విధాన నిర్ణయాలు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. ఇవి ఆధునికంగా ముందుకుపోని అనాధ కేంద్రాల్లా మిగిలిపోతున్నాయి. నేడు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివించే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు గౌరవప్రదమైన విద్యను కోరుకుంటున్నారు. కానీ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేమి, ఉపాధ్యాయుల కొరత, కొరవడుతున్న ప్రభుత్వ నిబద్ధత వలన ప్రభుత్వ విద్యాసంస్థల తీరు అగమ్యగోచరంగా మారాయి. ఈ క్రమంలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్య కమిషన్‌ నియమించింది. ఇటీవల విద్యా కమిషన్‌ సమర్పించిన విద్యా విధాన పత్రం 2026 విడుదల చేసింది. ఆధునిక విద్యావ్యవస్థకు అవసరమైన సిఫారసులు చేసింది.

ఈ విధాన పత్రం విద్యావ్యవస్థ మెరుగుపరచడానికి 18 శాతం నిధులు కావాలని స్పష్టం చేసింది. కానీ, శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో విద్యకు కేవలం 26,674 కోట్లు మాత్రమే ప్రకటించింది. గత ఏడాదితో(7.6 శాతం) పోలిస్తే స్వల్పంగా పెరిగినా మొత్తంగా చూస్తే 8.2 శాతమే నిధులు కేటాయించింది. దేశ సగటు(˜14-15శాతం)తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ నిధులతో విద్యా కమిషన్‌ సిఫార్సులు ఏ మేరకు అమలవుతాయో ప్రశ్నార్థకమే. మరోవైపు పాఠశాలలో ప్రైమరీ తరగతుల నిర్వహణ, విద్యార్థుల కిట్‌, బ్రేక్‌ ఫాస్ట్‌ పథకాలను ఈ విద్యా సంవత్సరం నుండి ప్రవేశపెట్టడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇంత తక్కువ బడ్జెట్‌లో ఈ పథకాలు అమలు ప్రకటనలకే పరిమితమయ్యే ప్రమాదం లేకపోలేదు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేర్కొనే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌, స్కిల్‌ యూనివర్సిటీ లాంటివి నిర్వహణ ఏ విధంగా అమలు చేస్తారో కూడా సందేహాస్పదమే. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ఉచిత వైద్యం స్వాగతించాల్సిన అంశం. కానీ రిటైరైన ఉద్యోగుల బెనిఫిట్స్‌, పెండింగ్‌ బిల్లులు, పిఆర్సీ ప్రస్తావన లేకపోవడం విచారకరం. ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనం నాణ్యతకు అదనపు నిధులు కేటాయించకపోవడం శోచనీయం. ప్రభుత్వాలు విద్యావ్యవస్థను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే కార్పొరేట్‌ విద్యా వ్యవస్థ మరింత పుంజుకుంటుంది. ఇది బడుగు, బలహీన వర్గాల పాలిట శాపంగా మారుతుంది. విద్యను సంక్షేమ చర్యగా, ప్రాధాన్యత కొరవడిన రంగంగా చూడడం సరికాదు. ఆర్ధిక కేటాయింపులతో చిత్తశుద్ధి కనబరచినప్పుడే విద్యావ్యవస్థ బాగుపడుతుంది.

సంపతి రమేష్‌
7989579428

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -