– ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన
నవతెలంగాణ – జుక్కల్: జుక్కల్ మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో ఆయా గ్రామాల సర్పంచ్ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలపై చర్చించినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శులు నాగయ్య, భరద్వాజ్ తెలిపారు. గ్రామసభల్లో బస్వాపూర్ సర్పంచ్ రమణ సురేష్ గౌడ్, పెద్దగుల్లా తాండా సర్పంచ్ సుమతి యశ్పాల్ రాథోడ్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, గ్రామీణ అంతర్గత రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.
అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం, ఉచిత యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, వైద్య–ఆరోగ్య సేవలు, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం తదితర సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును గ్రామపంచాయతీ కార్యదర్శులు సభలో చదివి వినిపించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్లు గ్రామస్తులను కోరారు. గ్రామసభల్లో ప్రజలు తమ సమస్యలు, సూచనలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.



