పేదలపై మరో భారం
సబ్సిడీ సిలిండర్లను
9 నుంచి 4కు కుదింపును సమర్థించుకుంటున్న కేంద్రం
సగటు వినియోగం పేరుతో కోతలు
పెరుగుతున్న ధరలతో పేద కుటుంబాలపై అదనపు భారం
‘ఎల్పీజీ వాడకం పెరిగింది’ అంటూనే సిలిండర్లు తగ్గింపు
మోడీ ప్రభుత్వ విరుద్ధ విధానాలపై సర్వత్రా విమర్శలు
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూ) కింద సబ్సిడీతో ఇచ్చే ఎల్పీజీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి తొమ్మిది నుంచి నాలుగుకు తగ్గించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటున్నది. దీనిపై ప్రతిపక్షాలు, సామాజిక వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉజ్వల లబ్ధిదారులు సగటున ఏడాదికి 4.71 సిలిండర్లే వినియోగిస్తున్నారని కేంద్రం చెప్తోంది. అయితే ఈ గణాంకాలను ఆధారంగా తీసుకుని సబ్సిడీని తగ్గించడం పేద కుటుంబాల వాస్తవ పరిస్థితిని విస్మరించడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది జులై 1 నాటికి ఉజ్వల పథకం కింద 10.58 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారనీ, వారందరి కనెక్షన్లు క్రియాశీలంగానే ఉన్నాయని తెలిపారు.
తక్కువ వినియోగానికి కారణం ఏమిటి?
ప్రభుత్వం సగటు వినియోగం 4.71 సిలిండర్లేనని చెప్తున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సగటు వినియోగం తగ్గడానికి కారణం ప్రజలకు తక్కువ గ్యాస్ అవసరం పడుతున్నందుకు కాదనీ, గ్యాస్ ధరలు అధికంగా ఉండటంతో కొనుగోలు చేయలేకపోవడం వల్లేనని విశ్లేషకులు చెప్తున్నారు. ఒక కుటుంబం ఎక్కువ సిలిండర్లు వాడకపోవడం విజయ సూచిక కాదనీ, అది కొనుగోలు సామర్థ్యం తగ్గిందనే సంకేతమని వారు అంటున్నారు.
ధరలు పెరిగినా భారం ప్రజలపైనే!
అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు పెరిగాయని, 14.2 కిలోల సిలిండర్ మార్కెట్ ధర రూ.1,695కు చేరినా రూ.942కే విక్రయిస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. అయితే రూ.942 కూడా గ్రామీణ, పేద కుటుంబాలకు పెద్ద మొత్తమేనని విమర్శకులు గుర్తుచేస్తున్నారు. ఉజ్వల లబ్ధిదారులకు రూ.300 సబ్సిడీ ఇచ్చినా, మిగిలిన ధరను చెల్లించడం అనేక కుటుంబాలకు భారంగా మారుతోందని వారు అంటున్నారు.
‘ఎల్పీజీ
ప్రధాన ఇంధనం’
అంటూనే
సబ్సిడీ కోతలు
ఉజ్వల కుటుంబాల్లో 86.59 శాతం మంది ఎల్పీజీనే ప్రధాన వంట ఇంధనంగా ఉపయోగిస్తున్నారని ప్రభుత్వం నిటి ఆయోగ్ అధ్యయనాన్ని ఉటంకించింది. ఇదే సమయంలో సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గించడం ప్రభుత్వ చేస్తున్న వాదనకే విరుద్ధంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. నిజంగా ఎల్పీజీ వినియోగం పెరిగి ఉంటే, ప్రజలను మరింత ప్రోత్సహించేలా సబ్సిడీ కొనసాగించాల్సింది పోయి కోతలు విధించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
సంక్షేమ పథకాలపై కోతల విధానమా?
ఉజ్వల పథకాన్ని పేద మహిళల ఆరోగ్యం, గౌరవప్రదమైన జీవనం కోసం తీసుకొచ్చామని ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు అదే పథకంలో సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గించడం ద్వారా సంక్షేమానికి బదులుగా వ్యయ నియంత్రణకే ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వంటగ్యాస్ ధరలు పెరుగుతున్న సమయంలో ఇలా కుదించడం పేద కుటుంబాలను మళ్లీ కట్టెల పొయ్యిల వైపు నెట్టే ప్రమాదం ఉందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీ వ్యయాన్ని హేతుబద్ధీకరించే ప్రయత్నమని చెప్తున్నప్పటికీ.. పేదల కొనుగోలు శక్తిని పెంచకుండా సగటు వినియోగ గణాంకాలను చూపించి సంక్షేమాన్ని కుదించడం సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కట్టెల వాడకం ఇంకా తగ్గలేదు
దేశంలోని అనేక కుటుంబాలు ఇప్పటికీ కట్టెలు, పిడకలు వంటి సంప్రదాయ ఇంధనాలను ఎల్పీజీతో పాటు వినియోగిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వమే పార్లమెంట్లో అంగీకరిం చింది. పండుగలు, పెద్ద వేడుకలు, త్వరగా వంట చేయాల్సిన సందర్భాల్లో మాత్రమే గ్యాస్ ఉపయోగించి, రోజువారీ వంటకు మళ్లీ కట్టెలకే పరిమితమవుతున్నారని అధ్యయనాలు సూచిస్తు న్నాయి. దీనిని బట్టి శుభ్రమైన ఇంధన వినియోగం ఇంకా పూర్తిస్థాయిలో స్థిరపడలేదని విశ్లేషకులు చెప్తున్నారు.



