వందరోజుల్లో రూ.6వేల కోట్లు చెల్లించాం
ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు తాజాగా గురువారం మరో రూ.2వేల కోట్లను విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో రూ. 6 వేల కోట్ల బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చిందనీ, ఆ ప్రకారం చివరి వాయిదాను కూడా చెల్లించేశామని గురువారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ర్ట ఖజానా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల స్పష్టమైన ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో భాగంగా గత మే 29న తొలి విడతగా రూ. 2 వేల కోట్లు, జూన్ 30న రెండో విడతలో రూ. 2 వేల కోట్లు, మూడో విడతగా ఇప్పుడు రూ. 2 వేల కోట్లు విడుదల చేశామన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంక్షేమానికి రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందనీ, వారికి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం ఈ నిధులతో పూర్తిగా చెల్లించిందని వివరించారు. రాబోయే రోజుల్లో మిగిలిన ఇతర బకాయిలను కూడా ఇదే రీతిలో క్రమపద్ధతిలో క్లియర్ చేస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయం, నిధుల విడుదలను ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది, ఉద్యోగ జేఏసీ నేతలు కొనియాడారు.



