Friday, July 31, 2026
E-PAPER
HomeNewsఎఫ్‌సీఆర్‌ఏ పోలిక సరికాదు

ఎఫ్‌సీఆర్‌ఏ పోలిక సరికాదు

- Advertisement -

పాశ్చాత్య దేశాల చట్టాలతో
విదేశీ నిధుల పారదర్శకత పేరుతో 
కేంద్రం వాదనకు ఆర్చ్‌బిషప్ జోసెఫ్ డిసౌజా ఖండన
అమెరికా, బ్రిటన్ చట్టాలు వివరాలకే పరిమితం..
భారత్‌లో మాత్రం 
అనుమతి, నియంత్రణ, రద్దు అధికారాలన్నీ 
ప్రభుత్వానివే
పౌర సమాజ సంస్థల స్వేచ్ఛపై ఎఫ్‌సీఆర్‌ఏ 
ఉచ్చు బిగుస్తోందని విమర్శ


న్యూఢిల్లీ : విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ)ను అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రజాస్వామ్య దేశాల చట్టాలతో పోల్చడం వాస్తవాలను వక్రీకరించడమేనని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు, గుడ్ షెపర్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా ఆర్చ్‌బిషప్ జోసెఫ్ డిసౌజా విమర్శించారు. విదేశీ నిధులపై పారదర్శకత కోరే పాశ్చాత్య దేశాల చట్టాలకు, విదేశీ నిధులు స్వీకరించేందుకు ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేసే భారత ఎఫ్‌సీఆరఏకు మౌలికమైన తేడా ఉందని ఆయనవివరించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోలికలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆయన అభిప్రాయపడ్డారు.

పారదర్శకత కాదు.. అనుమతి విధానం
కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆరఏను సమర్థించేటప్పుడు అమెరికా ఫారీన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (ఫారా)ను ఉదాహరణగా చూపుతోందనీ, అయితే ఫారా చట్టం విదేశీ సంస్థల తరఫున రాజకీయ, ప్రచార కార్యకలాపాలు నిర్వహించే వారు తమ సంబంధాలు, నిధులు, కార్యకలాపాల వివరాలను ప్రభుత్వానికి వెల్లడించాలనే నిబంధన మాత్రమే విధిస్తుందని వివరించారు. విదేశీ నిధులు స్వీకరించడాన్ని గానీ, అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని గానీ, ప్రచారం చేయడాన్ని గానీ ఆ చట్టం నిషేధించదని చెప్పారు. ఫారా ప్రకారం కేవలం విదేశీ విరాళం అందుకున్నందుకే ఏ సంస్థనైనా ‘విదేశీ ఏజెంట్‌’గా పరిగణించరని గుర్తు చేశారు.

ఎఫ్‌సీఆర్‌ఏతో అంతా ప్రభుత్వం చేతిలోనే!
భారత ఎఫ్‌సీఆరఏ మాత్రం పూర్తి భిన్నమని ఆయన అన్నారు. విదేశీ నిధులు స్వీకరించాలంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు నమోదు, అనుమతి తప్పనిసరి. ఆ నమోదు నిర్దిష్ట కాలానికోసారి పునరుద్ధరించుకోవాలి. ప్రభుత్వం ఎప్పుడైనా దానిని తిరస్కరించవచ్చు, సస్పెండ్ చేయవచ్చు, రద్దు కూడా చేయవచ్చు. కారణాలను స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉండదని ఆయన విమర్శించారు. ‘జాతీయ ప్రయోజనాలు’, ‘ప్రజా ప్రయోజనం’, ‘ఆర్థిక ప్రయోజనం’, ‘భద్రత’ వంటి స్పష్టమైన నిర్వచనాలు లేని కారణాలను చూపి సంస్థలకు విదేశీ నిధులు నిలిపివేయొచ్చని, ఈ నిబంధనలు అధికారులకు విపరీతమైన విచక్షణాధికారాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు.

మత, సామాజిక, మానవ హక్కుల
 కార్యకలాపాలపై ప్రభావం
ఇటీవలి సవరణలతో ఎఫ్‌సీఆరఏ పరిధి మరింత విస్తరించిందని డిసౌజా వివరించారు. మతప్రచారం, రాజకీయ, భావజాల అంశాలతో కూడిన కళా కార్యక్రమాలు, రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమాలు వంటి వాటికి విదేశీ నిధులను నిరాకరించే అవకాశం ఏర్పడిందని చెప్పారు. దీని వల్ల మానవ హక్కుల పరిరక్షణ, విధాన పరిశోధన, ప్రజా ప్రచారాలు, వ్యూహాత్మక న్యాయపోరాటాలు వంటి రంగాలు విదేశీ సహకారానికి దూరమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆస్తులపైనా ప్రభుత్వ నియంత్రణ
ఎఫ్‌సీఆరఏలోని తాజా సవరణల ప్రకారం.. విదేశీ నిధులతో నిర్మించిన ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఒక సంస్థ నమోదు రద్దయినా, ముగిసిపోయినా.. ఆ నిధులతో నిర్మించిన పాఠశాలలు, ఆస్పత్రులు, హాస్టళ్లు వంటి ఆస్తుల నిర్వహణ, బదిలీ, విక్రయ అధికారాలు ప్రభుత్వానికి దక్కుతాయని వివరించారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల చట్టాల్లో ఇలాంటి నిబంధనలు లేవని ఆయన స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితి, ఎఫ్‌ఏటీఎఫ్ కూడా ఆందోళన
2016లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధులు ఎఫ్‌సీఆర్‌ఏను రద్దు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని డిసౌజా గుర్తు చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే పౌరసమాజ సంస్థలను అణచివేయడానికి ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నారని వారు హెచ్చరించారని పేర్కొన్నారు.అలాగే 2024లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) కూడా భారత ఎఫ్‌సీఆరఏ అమలు విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలపై అనవసర ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని సూచించిందని తెలిపారు. తాజా సవరణలను ఉపసంహరించుకోవాలని పలు పౌరసంఘాలతో పాటు కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా కూడా డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

‘నియంత్రణ కాదు… సంకెళ్లు’
తాను విదేశీ మిత్రుల సహకారంతో భారత్‌లో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించానని, తమ లెక్కలను ఎప్పుడైనా పరిశీలించవచ్చని డిసౌజా తెలిపారు. అయితే ప్రజలకు సేవ చేసే హక్కు ప్రభుత్వ అనుమతిపై ఆధారపడే పరిస్థితిని అంగీకరించబోమన్నారు. “పాశ్చాత్య దేశాల చట్టాలు కేవలం వివరాలు అడుగుతాయి. భారత ఎఫ్‌సీఆరఏ మాత్రం ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకురమ్మంటుంది. ఒకటి పారదర్శకతకు సంబంధించినది, మరొకటి ప్రభుత్వ నియంత్రణకు సంబంధించినది. రెండింటినీ ఒకేలా చూపడం సరైంది కాదు. ఇది నియంత్రణ కాదు, పౌర సమాజంపై వేసిన సంకెళ్లు” అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -