జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు
నవతెలంగాణ – కామారెడ్డి
ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి ప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది “స్థిరమైన జీవితం ప్రారంభానికి తల్లిపాలు – ఫలితాలనిస్తున్న చర్యలను మరింత బలోపేతం చేయడం” అనే అంశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, పాలిచ్చే తల్లులకు అవసరమైన మద్దతు అందించడం, అనుబంధ పోషకాహార పద్ధతులను ప్రోత్సహించడం, గృహ సందర్శనల ద్వారా అవగాహన పెంచడం వంటి కార్యక్రమాలు అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రసవం అనంతరం వచ్చే పసుపు రంగు ముర్రుపాలు శిశువుకు అత్యంత పోషకాహారమని, బిడ్డ పుట్టిన వెంటనే వాటినే పట్టించాలని కుటుంబ సభ్యులకు సూచిస్తున్నట్లు తెలిపారు. శిశువుకు తొలి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలని, తల్లిపాలే బిడ్డకు తొలి టీకా వంటివని వివరించారు.
తల్లిపాలు శిశువును విరేచనాలు, న్యుమోనియా వంటి వ్యాధుల నుంచి రక్షించడంతో పాటు తల్లుల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయని తెలిపారు. అలాగే తల్లి – బిడ్డల మధ్య ప్రేమ, అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై గర్భిణులు, బాలింతలు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి ప్రసన్న తెలిపారు.



