– ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
– కార్యాచరణపై అధికారులతో సమీక్ష సమావేశం
నవతెలంగాణ – అశ్వారావుపేట
మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో వినూత్నంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే లక్ష్యంతో శనివారం నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.
గత నెలలోనే సన్నాహక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే, తాజా సమావేశంలో వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. సుమారు 20 ప్రభుత్వ శాఖలు ఈ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యేలా విధివిధానాలు రూపొందించినట్లు తెలిసింది.
గత మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చాటిచెప్పేలా వివిధ శాఖల శకటాల ప్రదర్శన, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాల ప్రదర్శన, విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు సన్మానం, ప్రశంసాపత్రాల ప్రదానం వంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వారావుపేట–జంగారెడ్డిగూడెం రహదారిలోని మినీ స్టేడియం నిర్మాణం ప్రతిపాదిత మైదానాన్ని పరిశీలించి, అక్కడే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించే అవకాశాలను అధికారులతో సమీక్షించారు.
అనంతరం అశ్వారావుపేట మూడు రోడ్ల ప్రధాన కూడలిలో పలు కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న మహనీయుల విగ్రహాలను పరిశీలించి, పనుల పురోగతిపై ఆరా తీశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



