బిఆర్ఎస్ మాయమాటలు చెప్పి మోసం చేసింది..
ఈజిసి రాష్ట్ర సభ్యుడు దండు రమేష్, సర్పంచ్ బండి స్వామి
నవతెలంగాణ – మల్హర్ రావు
తాడిచెర్ల ఓసీపీకి డేంజర్ జోన్ నిర్వాసితుల చీరకాల కోరికను రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు నెరవేరుస్తున్నారని, బిఆర్ఎస్ మాయమాటలు చెప్పి మోసం చేసిందని ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు దండు రమేష్,గ్రామ సర్పంచ్ బండి స్వామి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవంబర్ 11న 2017లో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన టిఎస్ జెన్కో ఉపరితల బొగ్గుగని హద్దు నుండి 500 మీటర్ల డేంజర్ జోన్లోని భూములు,నివాస గృహాలను సేకరించి నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని,మాయ మాటలు చెప్పి మోసం చేసినట్లుగా వాపోయారు.
నిర్వాసితులు గత పదేళ్లుగా అనేక ప్రజా ఉద్యమాలు,నిరాహారదీక్షలు,ధర్నాలు,బొగ్గుగని మీద వంట వార్పులు చేసి కేసుల పాలైన కూడా ప్రజలు ఉద్యమాలు చెసిన ఫలితంగా భూములకు,గృహాలను సర్వే నిర్వహించి డిసెంబర్ 5న 2022 సంవత్సరంలో ప్రిలిమినరి (పిఎన్) ప్రకటించడం జరిగిందన్నారు.2023 సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు తాడిచెర్ల డేంజర్ జోన్ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో ఫిబ్రవరిలో జెన్కో ఉన్నతాధికారులు,ప్రజాప్రతినిధులు, నిర్వాసితుల కమిటీ,నిర్వాసితులతో హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహించి రూ.261 కోట్లను కలెక్టర్ ఖాతాలో వేయించినట్లుగా తెలిపారు.
మంత్రి శ్రీదర్ బాబు,కలెక్టర్ ఆదేశాలతో జులై 17 నుంచి సర్వే బృందాలతో సర్వేలు చేయించడం తెలిసిందేన్నారు.ప్రజా ప్రభుత్వం, మంత్రి శ్రీదర్ బాబు చొరవతోనే డేంజర్ జోన్ ప్రజలకు న్యాయం జరుగుతుంటే కొందరు పనికిరాని వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో అవాస్తావాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకునేందుకు సన్నద్ధం కావడంపై నిర్వాసితులు ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దని చెప్పారు.అవసరమైతే ప్రజా ప్రభుత్వం హైకోర్టు న్యాయ నిపుణులచే న్యాయం చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో డేంజర్ జోన్ నిర్వాసితులు పాల్గొన్నారు.



