హైడ్రా రక్షించిన భూముల విలువ అక్షరాలా లక్షన్నర కోట్లని ఆ ఏజెన్సీ బాధ్యులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే రకంగా ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఐండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) జీవో ఎంఎస్ 99 ద్వారా 2024 జూలై 19న ఉనికిలోకి వచ్చింది. ఆ సంస్థ పురుడు పోసుకున్న ఈ రెండేండ్లలో 3,350 ఎకరాల భూములను కాపాడిందని, ఆ సొత్తు విలువ రూ.1.50 లక్షల కోట్లు ఉంటుందని కమిషనర్ రంగనాథ్ పునరుద్ఘాటించారు.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 1983లో ఏర్పాటయింది. ఈ 43 ఏండ్ల ఏసీబీ చరిత్రలో ఈ సంవ త్సరం రెండో త్రైమాసికంలో తొలిసారి అత్యధికంగా మూడు రకాల్లో 67 కేసులు రిజిస్టర్ అయ్యాయి. పది అక్రమార్జన, 34 ట్రాప్, 23 ఆకస్మిక తనిఖీ కేసులు నమోదయినట్టు డీజీ చారుసిన్హా ఈమధ్య వెల్లడించారు. ఇటీవలి కాలంలో పట్టుబడిన ఆయా శాఖల అధికారుల్లో తిమింగలాల మాదిరే ఉన్నారని కథనాలు వచ్చాయి. కొందరైతే ఏకంగా రూ.వందల కోట్లలో వెనకేసిన వైనం బట్టబయలైంది. అంటే హైడ్రా, ఏసీబీ స్వాధీన స్థిర చరాస్తులతో భారీ ఎత్తున ప్రభుత్వానికి ఆర్థిక పుష్టి కలుగుతుంది. హైడ్రా రక్షించిన ఆస్తుల విలువను లక్షన్నర కోట్లని అంచనా కట్టారు. అలాగే ఏసీబీకి పట్టుబడిన స్థిర చరాస్తుల విలువ కూడా బహిర్గతం చేయాలి.
కేసుల నమోదు గురించి సమాజానికి తెలియజేసినట్టే నగదు, నగలు, బంగళాలు, భూముల వగైరా స్వాధీన స్థితిని కూడా ఎప్పటికప్పుడు జనం ముందు ఉంచాలి. కేసులను తేల్చి, అక్రమ స్థిర చరాస్తులను సర్కారుకు అప్పగించడంలో ఎడతెరిపి లేని జాప్యానికి, చాదస్తానికి చరమగీతం పాడాలి. ఏసీబీ పట్టివేతల విలువ ఇప్పటివరకూ ఎంతలేదన్నా రూ. వేల కోట్లలోనే ఉండి ఉంటుంది. అది అక్రమ సొమ్మేనని అత్యంత పకడ్బందీగా, శీఘ్రంగా నిరూపించాలి. అటు మీదట ఆ స్థిర చరాస్తులను సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ఉత్పాదక రంగాలకు పారదర్శకంగా మళ్లించాలి. ఎలాగూ ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు భూముల వేలానికి పోతున్న ప్రభుత్వం హైడ్రా కాపాడిన స్థలాలనూ అందుకు పరిశీలించాలి. కనీసం తనఖా పెట్టయినా నిధులు సమీ కరించుకోవాలి. హైడ్రా, ఏసీబీ పటిష్ట పని తీరుతో తిరిగి సమాజానికి దక్కిన స్థిర చరాస్తులను అదే సమాజం లోని ప్రజావసరాలకు వినియోగించాలి. ఎంతసేపూ నెలనెలా ఎవరు అప్పు ఇస్తారా? అని దిక్కులు చూస్తూ వెతుక్కునే బదులు ఆ సంస్థల వల్ల దర్జాగా సొంతమైన ఆస్తిపాస్తులకు సొమ్ముల రూపం తేవాలి. తరచూ వెయ్యీ, రెండు వేల కోట్లు కనీసం 8 శాతం వడ్డీతో పాతిక, 30 సంవత్స రాల కాలవ్యవధి మేరకు బతిమాలి అప్పులు తీసుకొంటూ రాష్ట్రాన్ని రుణగ్రస్థం చేయడం మానేయాలి.
తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక వర్గాలకు వాగ్దానాల బకాయి పడింది. కొత్తగా రెండు లక్షల సామాజిక పింఛన్ల జాడే లేదు. వికలాంగులకు రూ. 4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామన్న పెన్షన్ దిక్కే లేదు. మహిళలకు నెలనెలా రూ. 2,500 ఊసే లేదు.ఉద్యోగుల పీఆర్సీ పెండింగ్ లోనే ఉన్నది. రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు పత్తా లేవు. విద్యార్థికి విద్యా భరోసా కార్డు సంగతే మరుగున పడేశారు. ఇట్లా కొండవీటి చాంతాడంత హామీల చిట్టా ఖజానాలో నిధుల్లేక చిన్నబోయింది. ఇది కాస్తా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ట, విశ్వసనీయతకు పరీక్ష, సవాలుగా మారుతోంది. చేతిలోని పిట్టను కాదని, చెట్టు మీది పిట్ట కోసం పాకులాడినట్టు…హైడ్రా, ఏసీబీ చేసిన మంచితో దక్కిన, దక్కుతున్న స్థిర చరాస్తులను తగిన విధంగా ఉపయోగించకుండా, రుణాల కోసం వెంపర్లాడు తున్నారు. పైగా అప్పులు పుట్టడం లేదని, రుణదాతలు నమ్మడం లేదని పాలకులే నిట్టూరుస్తున్నారు. ఇకనైనా రాష్ట్ర దరిద్రం పోయేలా డైనమిక్ గా, వాస్తవ ప్రాతిపదికన సమాలోచనలతో ఆర్థిక స్వావలంబన, పరిపుష్టి అంశంలో కార్యాచరణకు పూనుకోవాలి.
ఇల్లెందుల దుర్గాప్రసాద్, 9440850384
‘హైడ్రా, ఏసీబీ’ స్వాధీన సొత్తును ఏం చేస్తున్నారు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



