Tuesday, August 4, 2026
E-PAPER
Homeజాతీయం33 శాతం మహిళా రిజర్వేషన్లను తక్ష‍ణమే అమలు చేయాలి

33 శాతం మహిళా రిజర్వేషన్లను తక్ష‍ణమే అమలు చేయాలి

- Advertisement -

​ఎన్‌‌సీడబ్ల్యూఆర్‌ ఆధ్వర్యంలో​ కొనసాగుతున్న ధర్నా : ​సీఐటీయూ మద్దతు
​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

​పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ‘నేషనల్ కోయిలిషన్ ఫర్ ఉమెన్స్ రిజర్వేషన్’ (ఎన్‌‌సీడబ్య్లూఆర్‌) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నా సోమవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజస్తాన్‌‌కు చెందిన ‘ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్’ (ఐద్వా) మహిళలు రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి, చేతులపై ‘‘33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి’’ అనే సందేశాన్ని రాసుకుని ధర్నాలో పాల్గొన్నారు. సమాన రాజకీయ ప్రాతినిధ్యం అనే తమ రాజ్యాంగబద్ధమైన హక్కును పొందేలా, జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకుండా ఈ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్’ (సీఐటీయూ) ప్రతినిధి బృందం నిరసనా స్థలాన్ని సందర్శించి ఈ ఉద్యమానికి తమ మద్దతును ప్రకటించింది. ఈ బృందంలో సీఐటీయూ అఖిల భారత అధ్యక్షుడు సుదీప్ దత్తా, వర్కింగ్ ఉమెన్స్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎ.ఆర్. సింధు, మాజీ ఎంపీ తపన్ సేన్, జాతీయ కోశాధికారి ఎం. సాయి బాబు, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి పి.వి. అనియన్, ఢిల్లీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కమల ఉన్నారు.

మహిళా రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం
మహిళా సంఘాలు మూడు దశాబ్దాలకు పైగా మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాయనీ, ఈ పోరాటానికి సీఐటీయూ నిరంతరం అండగా నిలిచిందని సీఐటీయూ నాయకులు తెలిపారు. జనాభాలో సగం మంది మహిళలే ఉన్నందున, రాజకీయ ప్రాతినిధ్యంలో వారికి దక్కాల్సిన వాటాను ఇకపై నిరాకరించడం సమర్థనీయం కాదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మహిళల సమాన, సమర్థవంతమైన రాజకీయ భాగస్వామ్యం అత్యవసరమని పేర్కొన్నారు. జులై 29న తల్కటోరా స్టేడియంలో జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్తంగా 33 శాతం మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలుకు మద్దతుగా తీర్మానాన్ని ఆమోదించాయని తెలిపారు. ఆగస్టు 10న జరగనున్న దేశవ్యాప్త ‘జైల్ భరో’లో కూడా ఈ డిమాండ్‌ను లేవనెత్తుతామని ప్రకటించారు. ఈ ఆందోళనలో ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి కనినిక ఘోష్ ప్రసంగించారు. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం అనేది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి అత్యవసరమని వక్తలు నొక్కి చెప్పారు. దేశంలోని మహిళలను వారి రాజకీయ, ప్రజాస్వామ్య హక్కులకు ఇకపై దూరం చేయకూడదన్న తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాల నుంచి పెరుగుతున్న మద్దతుతో, పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు ఈ ధర్నా కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆశా శర్మ, సవిత, మంజీత్ రాఠీ, శర్బానీ సర్కార్, కమలా మేఘ్వాల్, అంజు, ఆశా యాదవ్, మైమూనా మొల్లా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడ‌బ్ల్యూ)కు చెందిన రెహానా ఖతూన్, దీప్తి, ఐసీడబ్ల్యూఎంకు చెందిన జాయిసియా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -