Tuesday, August 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంత్వరలో పాలమూరుకు పర్యావరణ అనుమతులు

త్వరలో పాలమూరుకు పర్యావరణ అనుమతులు

- Advertisement -

పోలవరం బ్యాక్‌వాటర్‌పై శాస్త్రీయ అధ్యయనం
సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయపరమైన స్పష్టత : 
నీటి పారుదల శాఖ మంత్రి 
ఉత్తమ్‌ ‌కుమార్‌‌రెడ్డి
​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పాలమూరు–రంగారెడ్డితో పాటు సీతారామ, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులను ఆరు నెలల్లో సాధించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ర్టంలోని సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన అంశాలు, పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై సోమవారం హైదరాబాద్‌‌లోని బీఆర్‌. అంబేడ్కర్‌ సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ ‌మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు న్యాయపరమైన స్పష్టతను కల్పించడంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల సాధనకు కొత్త ద్వారాలను తెరిచిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతోపాటు సంబంధిత చట్టబద్ధ సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రతిపాదనలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. గతంలో తిరస్కరణకు గురైన ప్రాజెక్టుల ప్రతిపాదనలను పరిశీలించి, సాంకేతిక, విధానపరమైన లోపాలను సరిదిద్ది తిరిగి సమర్పించాలన్నారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నోడల్‌ అధికారిని నియమించి రికార్డులను ఏడు రోజుల్లో సమీకరించాలని ఆదేశించారు. పర్యావరణ అధ్యయనాలు, నిబంధనల అమలు నివేదికలు, భూ రికార్డులు, న్యాయపరమైన పత్రాలు, ఇతర అవసరమైన దస్త్రాలను 30 రోజుల్లో, దరఖాస్తుల తయారీ, పరిశీలన, సమర్పణకు సంబంధించిన దశలను 60 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి నెలా ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను నిర్వహణకు సిద్ధంగా ఉంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఇంజినీర్లను ఆదేశించారు. పంపులను వినియోగంలోకి తీసుకొచ్చే సమయానికి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తనిఖీలు పూర్తి చేయాలని సూచించారు. అనుమతి రాగానే సీతారామ సాగర్‌ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇంజినీరింగ్‌ ప్రణాళికలు, అంచనాలు, టెండర్‌ పత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల విషయంలోనూ ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని ఉత్తమ్ ఆదేశించారు. భూములు, గ్రామాలు, నివాస ప్రాంతాలు, ప్రజా మౌలిక వసతులు, ఇతర ఆస్తులు ఎంతవరకు ముంపుకు గురయ్యే అవకాశం ఉందో నిర్ధారించాలని సూచించారు. బాధితులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత సంబంధిత కేంద్ర సంస్థలదేనని స్పష్టం చేశారు. సమీక్షలో ఈఎన్‌‌సీలు ఓవీ. రమేష్‌బాబు, పి.శ్రీనివాస్‌, ఆర్‌.మధుసూదన్‌రావు, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర విభాగం బలోపేతం….
సాగునీటి ప్రయోజనాల పరిరక్షణలో అంతర్రాష్ట్ర విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని ఉత్తమ్‌ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ), కోర్టులు, చట్టబద్ధ సంస్థల ముందు తెలంగాణ వాదనను బలంగా వినిపించే సామర్థ్యాన్ని పెంపొందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగా లతో సమన్వయం, దరఖాస్తుల పురోగతి, న్యాయ వ్యవహారాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాల న్నారు. కోర్టు కేసుల విషయంలో న్యాయ సలహా దారులు, అదనపు అడ్వకేట్‌ జనరల్‌, సీనియర్‌ న్యాయవాదులతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -