కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఉద్యమకారుడు, అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇటీవల అమరవీరుడు యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్యకు విజయవంతంగా మైనర్ శస్త్రచికిత్స పూర్తికావడంతో, కోలుకున్న చిన్నారి భవిష్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులు సోమవారం హైదరాబాద్‌లోని నందినగర్‌లోని ఆయన నివాసంలో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
చిన్నారి భవిష్యతో కేటీఆర్ ఆప్యాయంగా ముచ్చటిస్తూ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో ఉన్నత స్థాయికి ఎదగాలనీ, చదువుల్లో బాగా రాణించాలని ఆకాంక్షించారు.
గత నెల మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలో అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా, యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్య ఆరోగ్య సమస్య గురించి కేటీఆర్ తెలుసుకున్నారు. ఆమెకు మైనర్ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించిన విషయం తెలిసిన వెంటనే ఆందోళన చెందొద్దని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున మెరుగైన వైద్య చికిత్స అందేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి చిన్నారి భవిష్యకు విజయవంతంగా చికిత్స పూర్తయ్యేలా అన్ని విధాలా సహకరించిన కేటీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ అండ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



