పరకాలలో ఎరువుల డీలర్లకు ఏడీఏ హెచ్చరిక
నవతెలంగాణ – పరకాల
పరకాల మండలంలోని ఎరువుల డీలర్లతో బుధవారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏడీఏ జె. అవినాష్ వర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎడిఎ మాట్లాడుతూ.. డీఏపీతో పాటు ఇతర ఎరువులను అధిక ధరలకు విక్రయించడం, ఇతర ఉత్పత్తులతో బలవంతంగా లింక్ చేసి అమ్మడం, కృత్రిమ కొరత సృష్టించడం, నిషేధిత పురుగు మందులను విక్రయించడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని హెచ్చరించారు.
ఇలాంటి అక్రమాలకు పాల్పడే డీలర్లపై ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల రైతుల ఫిర్యాదుల మేరకు నిర్వహించిన తనిఖీల్లో పరకాలకు చెందిన క్రాంతి ట్రేడర్స్, భద్రకాళి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ సంస్థల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన నేపథ్యంలో ఆయా డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. గతంలో కూడా పలుమార్లు హెచ్చరించినప్పటికీ కొందరు డీలర్లు నిబంధనలు పాటించకపోవడంతో వారిపై చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఎవరైనా ఎరువులను అధిక ధరలకు విక్రయించడం, లింక్ సేల్స్ చేయడం లేదా ఇతర అక్రమాలకు పాల్పడుతున్నట్లు రైతులు గమనిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి ఎస్. శ్రీనివాస్‌తో పాటు సుమారు 35 మంది ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.



