అమ్మపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమృతం. అయినప్పటికీ మన సమాజంలో అమ్మపాల గురించి అనేక అపోహలు ఇంకా కొనసాగుతున్నాయి. వాటి కారణంగా కొంతమంది తల్లులు తమ పిల్లలకు పాలివ్వడం ఆపేస్తున్నారు. మరికొందరైతే మొదటి రోజుల నుంచే పాలపొడి వాడుతున్నారు. అందుకే ప్రతి ఏడాది ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుతున్నారు. ఈ వారం రోజుల పాటు బిడ్డకు తల్లి పాల అవసరంతో పాటు, పాలివ్వడం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికి చాలా మంది బిడ్డలు తల్లిపాలకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సాధారణ అపోహలు, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలను ఈరోజు తెలుసుకుందాం.
అపోహ: పుట్టిన వెంటనే వచ్చే పసుపు రంగు పాలు మురికిపాలు.
నిజం: అవి ముర్రుపాలు (కొలస్ట్రం). అవే బిడ్డకు తొలి టీకా. వాటిని తప్పకుండా తాగించాలి.
అపోహ: సిజేరియన్ అయితే పాలు రావు.
నిజం: సిజేరియన్ చేసిన తల్లులకు కూడా పాలు వస్తాయి. కొద్దిగా ఆలస్యం కావచ్చు కానీ సరైన సహాయం అందితే చాలామంది విజయవంతంగా పాలివ్వగలరు.
అపోహ: చిన్న రొమ్ములు ఉంటే పాలు తక్కువ వస్తాయి.
నిజం: రొమ్ము పరిమాణానికి పాల ఉత్పత్తికి సంబంధం లేదు.
అపోహ: పల్చగా కనిపించే పాలు పోషకాహారం కావు.
నిజం: పల్చగా కనిపించే పాలు కూడా బిడ్డకు అవసరమైన పోషకాలు, నీరు అందిస్తాయి.
అపోహ: మొదటి ఆరు నెలలు నీళ్లు తప్పనిసరిగా ఇవ్వాలి.
నిజం: అవసరం లేదు. అమ్మపాలలోనే బిడ్డకు కావలసిన నీరు ఉంటుంది.
అపోహ: తేనె ఇస్తే ఆరోగ్యం బాగుంటుంది.
నిజం: ఒక సంవత్సరం లోపు పిల్లలకు తేనె ఇవ్వకూడదు. ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
అపోహ: పాలు సరిపోవడం లేదు కాబట్టి పాలపొడి మొదలుపెట్టాలి.
నిజం: ఎక్కువ సందర్భాల్లో సమస్య పాలు తక్కువగా ఉండడం కాదు, సరైన విధంగా పాలివ్వకపోవడమే.
అపోహ: బిడ్డ ఏడిస్తే తల్లిపాలు సరిపోవడం లేదు.
నిజం: బిడ్డ ఏడవడానికి ఆకలితో పాటు అనేక కారణాలు ఉంటాయి.
అపోహ: తల్లి జలుబు చేస్తే పాలివ్వకూడదు.
నిజం: సాధారణ జలుబు ఉన్నా ఎక్కువ సందర్భాల్లో పాలివ్వవచ్చు. వైద్యుని సూచనలు పాటించాలి.
అపోహ: తల్లికి జ్వరం ఉంటే పాలు విషంగా మారతాయి.
నిజం: కాదు, కారణాన్ని బట్టి వైద్యుడి సలహా తీసుకోవాలి. చాలా సందర్భాల్లో పాలివ్వడం కొనసాగించవచ్చు.
అపోహ: ఉద్యోగం చేస్తే పాలివ్వడం అసాధ్యం.
నిజం: పాలను సేకరించి నిల్వ చేసి బిడ్డకు ఇవ్వవచ్చు.
అపోహ: పాలిచ్చే తల్లి ఎక్కువ నెయ్యి తింటేనే పాలు పెరుగుతాయి.
నిజం: సమతుల ఆహారం, తరచూ పాలివ్వడం, తగిన విశ్రాంతి ముఖ్యమైనవి.
అపోహ: పాలు తాగిన తర్వాత బిడ్డకు వెంటనే నీళ్లు ఇవ్వాలి.
నిజం: అవసరం లేదు.
అపోహ: పాలిచ్చే తల్లి కొన్ని పండ్లు తినకూడదు.
నిజం: చాలా పండ్లు సురక్షితమే. ప్రత్యేక అలర్జీలు ఉంటే మాత్రమే జాగ్రత్త అవసరం.
అపోహ: తల్లి కోపంగా ఉంటే పాలు చెడిపోతాయి.
నిజం: మానసిక ఒత్తిడి పాల ఉత్పత్తిపై ప్రభావం చూపవచ్చు కానీ పాలు విషంగా మారవు.
అపోహ: పాలు తాగిన బిడ్డ తరచూ మలం చేస్తే జబ్బు.
నిజం: పూర్తిగా అమ్మపాలు తాగే పిల్లల్లో తరచుగా మలం రావడం సాధారణమే.
అపోహ: బిడ్డకు విరేచనాలు వస్తే పాలివ్వకూడదు.
నిజం: అలాంటి సమయంలో తల్లిపాలు మరింత అవసరం.
అపోహ: తల్లి యాంటీబయాటిక్స్ తీసుకుంటే పాలివ్వకూడదు.
నిజం: అన్ని మందులు కాదు. చాలామంది యాంటీబయాటిక్స్ పాలిచ్చే సమయంలో కూడా వాడవచ్చు. వైద్యుడిని సంప్రదించాలి.
అపోహ: ఒక సంవత్సరం తర్వాత అమ్మపాల ఉపయోగం ఉండదు.
నిజం: రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం కూడా అమ్మపాలు పోషకాహారం, రోగనిరోధక శక్తిని అందిస్తాయి.
అపోహ: బాటిల్‌తో పాలు ఇవ్వడం ఆధునిక పద్ధతి.
నిజం: బాటిళ్లను సరిగా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.
అపోహ: రాత్రిపూట పాలివ్వకూడదు.
నిజం: రాత్రి పాలివ్వడం వల్ల పాల ఉత్పత్తి బాగా కొనసాగుతుంది.
అపోహ: పిల్లలు తరచూ పాలు అడిగితే పాలు చాలడం లేదు.
నిజం: చిన్నపిల్లలు తరచూ పాలు తాగడం సహజం.
అపోహ: ఫార్ములా పాలు కూడా అమ్మపాలంతే.
నిజం: ఫార్ములా పాలు అవసరమైన కొన్ని పరిస్థితుల్లో ఉపయోగపడతాయి. కానీ ఆరోగ్యకరమైన శిశువుకు అమ్మపాలకు సమానమైన ప్రత్యామ్నాయం కావు.
అపోహ: పాలిచ్చే తల్లి సాధారణ వ్యాయామం చేయకూడదు.
నిజం: వైద్యుని సలహా మేరకు తేలికపాటి వ్యాయామం చేయవచ్చు.
అపోహ: అమ్మపాలు ఇవ్వడం తల్లి బాధ్యత మాత్రమే.
నిజం: కాదు. ఇది మొత్తం కుటుంబం, సమాజం, ఆరోగ్య వ్యవస్థ కలిసి విజయవంతం చేయాల్సిన బాధ్యత.
తల్లిపాల వారోత్సవాలు
తల్లిపాలకు ఎంతో విశిష్టత ఉంది. బిడ్డకు తల్లిపాలు అమృతంలా పనిచేస్తాయి. పుట్టిన అర గంటలోపు తల్లిపాలు ఇవ్వడం ద్వారా శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు, మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. నేటి ప్రపంచంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం లేదు. అలాంటి పిల్లల ఎదుగుదలలో లోపాలు కనిపిస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ పిల్లలకు తల్లిపాల విశిష్టతను తెలియచేసేందుకు ఏటా ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడంతో పాటు తల్లిపాల అవశ్యకతపై అవగాహన కల్పించనున్నారు.
తల్లికీ ఉపయోగం
బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయి. బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు. బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావం అదుపులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
శిశు మరణాల నివారణ
ఎక్కువ మంది శిశువులకు ఇన్ఫెక్షన్లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాసకోశవ్యాధులతో మరణాలు సంభవించడాన్ని యూనిసెఫ్ గుర్తించింది. అలాంటి మరణాలను నివారించేందుకు పుట్టిన అర గంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవించే మరణాలను తగ్గించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దీంతో తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు.


