వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలలో అమెరికాకు తప్పని ఎదురు దెబ్బలు
ఇప్పుడు ఇరాన్‌లోనూ అదే పరిస్థితి
కుడితిలో పడిన ఎలుకలా విలవిలలాడుతున్న ట్రంప్
వాషింగ్టన్ : తమ సొంత ప్రతిష్టను, దేశ కీర్తిని కాపాడుకోవడానికి యుద్ధాలను తీవ్రతరం చేసిన అమెరికా అధ్యక్షులు ఓ ప్రమాదకరమైన దారిలో నడిచారని చరిత్ర చెబుతోంది. గతంలో వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలపై గెలవలేమని తెలిసికూడా వారు అయిష్టంగానే ముందుకు సాగారు. ఇప్పుడు ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో కూడా ట్రంప్ అలాగే చిక్కుకుపోయారు. లొంగిపోయేందుకు లేదా చర్చలను ముందుకు తీసుకుపోయేందుకు ఇరాన్ నిరాకరించడంతో ఆయన పరిస్థితి కుడితిలో పడిన ఎలుక చందంగా తయారైంది. ఓ వైపు దౌత్య యత్నాలు విఫలమవుతున్నాయి. మరోవైపు వైమానిక దాడులు, దిగ్బంధనాలు కొనసాగుతున్నాయి. యుద్ధం ముగిసి పరిస్థితి ఎప్పుడు చక్కబడుతుందో ఎవరికీ తెలియడం లేదు.
ముందున్నది మూడు దారులే
ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారన్నదే అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఇరాన్ సైనిక లక్ష్యాల పైనే కాకుండా పౌర, మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం ద్వారా పోరును తీవ్రతరం చేస్తారా లేక భూతల దాడులతో యుద్ధాన్ని తుది దశకు తీసుకొని వెళతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ రెండే కాకుండా మరో దారి కూడా ఉంది. ఇప్పటికే అపార నష్టం జరిగినందున ప్రధాన లక్ష్యాలను సాధించకుండానే యుద్ధ క్షేత్రం నుంచి వైదొలగడం. అయితే అది ట్రంప్‌కు ఇష్టం లేకపోవచ్చు. ఏదేమైనా అటు గెలవలేని, ఇటు ఓడిపోని యుద్ధంలో ఆయన చిక్కుకుపోయారు. ఇరాన్‌ను ఏ విధంగా శిక్షించాలో సూచించాలంటూ సైనిక విశ్లేషకుల బృందానికి పెంటగాన్ ఓ అభ్యర్థన పంపింది. అమెరికా ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. ఇరాన్ తన తాజా ఎత్తుగడలను తోసిపుచ్చిన తర్వాత ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘ఓ మంచి పత్రంపై సంతకం చేయడానికి వారికి ఇదే చివరి అవకాశం’ అని చెప్పారు. ఇరాన్‌కు శిరచ్ఛేదం తప్పదని హూంకరించారు. ఒకవేళ ఇరాన్ ఈ బెదిరింపులను కూడా పట్టించుకోకపోతే ట్రంప్ ఏం చేస్తారు?
భూతల దాడులతో రక్తపాతమే
ఒకవేళ ఇరాన్‌లోని బ్రిడ్జిలు, విద్యుత్ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేస్తే టెహ్రాన్ కూడా గల్ఫ్‌లో వాషింగ్టన్ మిత్ర దేశాలకు చెందిన అవే లక్ష్యాలను ఎంచుకునే అవకాశం ఉంది. అప్పుడు ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. ప్రాంతీయ నాయకులు గత వారం ట్రంప్‌తో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. హార్ముజ్ జలసంధిని తెరవడానికి ట్రంప్ తన నౌకాదళాన్ని ఉపయోగించవచ్చు. కానీ ఇరాన్ చూస్తూ ఊరుకోదు. అమెరికా నౌకలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తుంది. ఖర్గ్ ద్వీపంలోని చమురు ఎగుమతి కేంద్రంపై భూతల దాడులు జరిపినా లేదా ఇరాన్ బలగాలను బలవంతంగా వెనక్కి నెట్టినా మరింత రక్తపాతం జరగవచ్చు. వైమానిక యుద్ధం భూతల యుద్ధంగా మారితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ప్రాణనష్టం పెరిగే కొద్దీ రాజకీయంగా చెల్లించుకోవాల్సిన మూల్యం కూడా భారీగానే ఉంటుంది. మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ దీనిని కొనితెచ్చుకోలేరు.
వారికీ సంకట స్థితి ఎదురైంది
ఇప్పుడు ట్రంప్ ఎదుర్కొంటున్న సంకట స్థితినే గతంలో కూడా అమెరికా అధ్యక్షులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలపై పోరు సాగినప్పుడు చోటుచేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. యుద్ధంలో ఓడిపోవాలని ఏ
అధ్యక్షుడూ కోరుకోడు. అయితే వియత్నాం యుద్ధం విషయంలో లిండన్ బి.జాన్సన్, రిచర్డ్ నిక్సన్,
ఇరాక్ యుద్ధంలో జార్జ్ డబ్ల్యూ బుష్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో బరాక్ ఒబామా చేదు అనుభవాలను
చవిచూశారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో
ఆఫ్ఘనిస్తాన్‌లో సైనిక బలగాలను పెంచారు. కానీ ఆ తర్వాత విధిలేని పరిస్థితులలో దళాలను ఉప
సంహరించుకున్నారు. తాజాగా ఇరాన్ విషయంలో కూడా ఆయనకు ఎదురు దెబ్బలు తప్పేలా లేవు.



