నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజలు సమర్పించే ప్రతి వినతిపై బాధ్యతగా స్పందిస్తామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి అర్జీకి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ప్రజల మాటే ప్రభుత్వ నిర్ణయాలకు మార్గదర్శకమని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు, బాధలు, ఆశలు, ఆకాంక్షలు తెలుసుకోవాలంటే ప్రజల మధ్యకే వెళ్లాలని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతి బుధవారం నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు అందజేసిన ప్రతి వినతిపత్రాన్ని మంత్రి సీతక్క క్షుణ్ణంగా పరిశీలించారు. సమస్యల స్వభావాన్ని తెలుసుకుంటూ సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. సమస్యలను వినడమే కాకుండా వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి అమలులో జరిగిన అక్రమాల కారణంగా తమ భూములు ఇతరులు ఆక్రమించుకున్నారని పలువురు బాధితులు మంత్రికి ఫిర్యాదు చేశారు. రాత్రికి రాత్రే పట్టాదారు పాస్ పుస్తకాల్లో మార్పులు జరిగాయని వాపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఇండ్లు రాని అర్హులైన కుటుంబాలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచాలని యువత విజ్ఞప్తి చేసింది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షలతో నమోదు చేసిన పోలీసు కేసులను ఎత్తివేయాలని పలువురు వినతిపత్రాలు సమర్పించారు.
అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు గిరిజనులు, అటవీ ప్రాంతాల ప్రజలు మంత్రి సీతక్క దృష్టికి తీసుకొచ్చారు. తమ హక్కులను పరిరక్షించాలని కోరుతూ ఆమెకు వినతి పత్రాలు అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సంబంధిత శాఖల అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడి చట్టబద్ధంగా సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ వదిలివెళ్లిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్టు తెలిపారు.
ప్రతి వినతిపై బాధ్యతగా స్పందిస్తాం : మంత్రి సీతక్క
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



