- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
నవతెలంగాణ-హైదరాబాద్: మహిళా బిల్లుతో డీలిమిటేషన్ ముడిపెట్టొద్దని, వాటిని విడదీసి మహిళా బిల్లు విడిగా పెడితే ఆమోదించేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. ఈ రెండిటినీ కలిపి పెట్టడం ద్వారా ప్రతిపక్షాలు మహిళా బిల్లును అడ్డుకుంటున్నాయనే తప్పుడు ప్రచారం చేసేందుకు, బీజేపీ దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తోందనీ అన్నారు. గురువారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు.
ఈ పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం ముందుకు వస్తున్నారని, వాటిని విడదీసి ప్రవేశపెట్టాలని అన్నారు. మహిళా బిల్లును పెడితే ఆమోదించేందుకు అందరూ సిద్ధమేనని తెలిపారు. డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం లేదని, ప్రతిపక్ష పార్టీలతోనూ సంప్రదించలేదని తెలిపారు. అనిశ్చితిలో ఉన్న అంశాన్ని తీసుకొచ్చి మహిళా బిల్లును ఆమోదించకుండా చేసి ప్రతిపక్షాలపై నెపం నెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పైగా ఆపరేషన్ లోటస్‌లో భాగంగా ప్రతిపక్ష పార్టీలను చీల్చి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలూ చేస్తున్నారని అన్నారు. బిల్లు విషయంలో కేంద్ర ప్రతిపక్షాలతో చర్చించిన అనంతరమే ముందుకు వెళ్లాలని అన్నారు.



