28 గేట్ల ద్వారా నీటి విడుదల
ప్రస్తుతం 317.48 మీటర్ల వద్ద నీటిమట్టం
నవతెలంగాణ- ధరూర్
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు గురువారం ఉదయం ప్రాజెక్టు 28 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,30,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. జూరాల జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా, సాగునీటి కాలువలు, లిఫ్ట్ పథకాల ద్వారా కూడా అవసరమైన మేరకు నీటిని వదులుతున్నారు. మొత్తం 2,20,319 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల అవుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.48 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.608 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు దాదాపు నిండే స్థితికి చేరుకుంది. భారీగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నదిలోకి చేపల వేటకు వెళ్లరాదని, నది ఒడ్డున సంచరించొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



