– సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ జవ్వాది వెంకటేశ్వరబాబు
– సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఇండక్షన్ ప్రోగ్రాం
నవతెలంగాణ – సత్తుపల్లి
స్పష్టమైన లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్తు సుగమం అవుతుందని కొత్తగూడెంకు చెందిన ప్రముఖ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, యోగా ప్రాక్టీషనర్ జవ్వాది వెంకటేశ్వరబాబు అన్నారు. సత్తుపల్లి మండలం పరిధిలోని గంగారం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన బీటెక్, డిప్లొమా, బి.ఫార్మసీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రత్యేక ప్రేరణాత్మక (మోటివేషనల్) సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ జవ్వాది వెంకటేశ్వరబాబు ముఖ్య వక్తగా హాజరయ్యారు.
లక్ష్య సాధన – వ్యక్తిత్వ వికాసం:
విద్యార్థులను ఉద్దేశించి మోటివేషనల్ స్పీకర్ వెంకటేశ్వరబాబు మాట్లాడుతూ… ప్రతి విద్యార్థి జీవితంలో ఒక స్పష్టమైన విజన్, లక్ష్యాన్ని ఎంచుకోవాలని సూచించారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా అధిగమించేందుకు ఆత్మవిశ్వాసం, అంతరాత్మ ప్రబోధం, మైండ్ పవర్ చాలా అవసరమని చెప్పారు. విలువైన సమయాన్ని వృధా చేసే పనులకు దూరంగా ఉండాలని హితవు పలికారు. చదువుతో పాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, టీం వర్క్ పెంపొందించుకోవాలన్నారు. మత్తు పదార్థాల నిరోధం (యాంటీ నార్కోటిక్స్), చిన్న పిల్లలు, మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, మానసిక ఒత్తిడి నిర్వహణ, తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవభావం వహించడంపై విస్తృత అవగాహన కల్పించారు. సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులు ఎదగాలన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఊటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ… విద్యార్థులు ఉన్నతమైన ఆశయాలను కలిగి ఉన్నప్పుడే భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా సమాజానికి, దేశానికి సేవ చేయగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్, హెటిరో గ్రూప్ సంస్థల చైర్మన్, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద వర్చువల్ విధానంలో పాల్గొని కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు.
జేఎన్‌టీయూహెచ్ నిబంధనల ప్రకారం విద్యార్థుల్లో సమగ్ర అవగాహన కోసమే ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్, హ్యుమానిటీస్ విభాగాధిపతి డాక్టర్ షేక్ మీరాసాహెబ్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ బలుసుపాటి సీతారాములు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



