రక్షిత శ్రీ చేతిలో అనూహ్య ఓటమి
కొరియా ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్
సియోల్ (దక్షిణ కొరియా)
తైపీ ఓపెన్ విజయంతో టైటిల్ ఫేవరేట్‌గా కొరియా మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్లో అడుగుపెట్టిన తన్వీ శర్మకు అనూహ్య షాక్ తగిలింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో సహచర భారత షట్లర్ రక్షిత శ్రీ సంతోష్ రామ్రాజ్ చేతిలో తన్వీ శర్మ పరాజయం పాలైంది. మూడో సీడ్ తన్వీ శర్మ 21-18తో తొలి గేమ్‌ను గెల్చుకుని ముందంజ వేసినా.. రక్షిత శ్రీ తర్వాత వరుస గేముల్లో పుంజుకుంది. 21-19, 21-18తో ఉత్కంఠగా సాగిన గేముల్లో రక్షిత శ్రీ పైచేయి సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ మరో క్వార్టర్ఫైనల్లో అస్మిత చాలిహ సత్తా చాటింది. గంటకు పైగా, మూడు గేముల పాటు సాగిన హోరాహోరీ మ్యాచ్‌లో 20-22, 21-15, 21-19తో టాప్ సీడ్ హినా అకెచి (జపాన్)పై మెరుపు విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో అస్మిత చాలిహతో రక్షిత శ్రీ తలపడనుంది. ఇద్దరు భారత షట్లర్లు పోటీపడుతున్న సెమీఫైనల్ కావటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మెన్స్ డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్, పృథ్వీ కృష్ణమూర్తి జోడీ 7-21, 8-21తో మలేషియా షట్లర్ల చేతిలో ఓటమి చెందారు.



