Saturday, August 8, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ ప్రశ్నలు లీక్ చేసింది ఆ ముగ్గురే

నీట్ ప్రశ్నలు లీక్ చేసింది ఆ ముగ్గురే

- Advertisement -

చార్జ్‌షీట్‌లో సీబీఐ స్పష్టం 20 వేల పేజీల ఆధారాలు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో స‌మ‌ర్పించినట్టు వెల్లడి
ఎన్టీఏ విధి నిర్వహణలోనూ లోపాలున్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు

న్యూఢిల్లీ : నీట్ యూజీ పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. పేపర్ లీకేజీకి బాధ్య‌త‌ వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలనంటూ న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేసిన సుదీర్ఘ పోరాటం విజయాన్ని సాధించింది. ఎట్టకేలకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే 2026 నీట్ యూజీ పేప‌ర్ ఎలా లీకైంద‌న్న అంశంపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖ‌లు చేసింది. 94 పేజీలతో సీబీఐ ఓ నివేదిక‌ను త‌యారు చేసింది. సీబీఐ ఛార్జ్‌షీట్ వివరాల ప్ర‌కారం … ముగ్గురు స‌బ్జెక్టు నిపుణులు ప్ర‌శ్న‌ల‌ను కంఠ‌స్థం చేసి, చిట్టాల మీద రాసుకుని, బుక్స్‌లో సంబంధిత పేరాగ్రాఫ్‌ల‌ను మార్క్ చేసి మ‌రీ పేప‌ర్ లీకేజీకి పాల్ప‌డ్డారు.

క్వశ్చన్ పేపర్ల తయారీ బృందంలో ఆ ముగ్గురు ….
నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన బృందంలోని ముగ్గ‌రు స‌బ్జెక్ట్ నిపుణులు పేప‌ర్ లీకేజీకి పాల్ప‌డ్డారని సీబీఐ తెలిపింది. క్వ‌శ్చ‌న్ పేప‌ర్ల‌ను త‌యారు చేసే బృందంలో ఆ ముగ్గురూ ఉన్నారనీ, పీవీ కుల‌కర్ణి, మ‌నీశ్ మాంధారే, మ‌నీషా హ‌వ‌ల్దార్‌.. అనే ముగ్గురు నీట్ యూజీ పేప‌ర్ లీకేజీకి కార‌ణ‌మ‌ని ప్రాథ‌మికంగా గుర్తించినట్టు తెలిపింది. కెమిస్ట్రీ స‌బ్జెక్టులో కుల‌క‌ర్ణి నిపుణుడు. వృక్ష శాస్త్రంలో మాంధారే, భౌతిక శాస్త్రంలో హ‌వ‌ల్దార్ నిపుణులు. నీట్ పేప‌ర్ లీకేజీ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 13 మంది నిందితుల‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఎన్టీఏ సెంట‌ర్‌లో ప్ర‌శ్నాప‌త్రాల‌ను త‌యారు చేస్తున్న స‌మ‌యంలో… ఈ ముగ్గురు నిందితులు ప్ర‌శ్న‌ల‌ను కాపీ చేసి వాటిని చీటీల‌పై రాసుకున్నారనీ, కొన్ని ప్ర‌శ్న‌ల‌ను ఎన్సీఈఆర్టీ బుక్స్‌లో ఉన్న పేరాగ్రాఫ్‌ల్లో మార్క్ చేసిన‌ట్టు సీబీఐ ఛార్జ్‌షీట్ ద్వారా వివరించింది.

డిజిటల్ వాడకుండా …
ఆ ముగ్గురు నిందితుల‌కు ఎన్టీఏలో క్వ‌శ్చ‌న్ సెట్టింగ్‌, ట్రాన్స్‌లేష‌న్ సెక్ష‌న్ల‌కు యాక్సెస్ ఉంద‌ని సీబీఐ ఛార్జ్‌షీట్ ద్వారా తెలిసింది. ఎన్టీఏ సెంట‌ర్ నుంచి సేక‌రించిన స‌మాచారాన్ని న‌మ్మ‌క‌మైన వ్య‌క్తులు, కోచింగ్ సెంట‌ర్ల ద్వారా విద్యార్థుల‌కు చేరేలా చేశారనీ, అయితే ఈ ప్ర‌క్రియ డిజిట‌ల్ విధానాల‌ను వాడ‌కుండా .. నిందితులు త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారని తెలిపింది. ఆర్థికంగా లాభ‌ప‌డేందుకు, ట్యూష‌న్ విద్యార్థుల్లో స‌క్సెస్ రేటును పెంచేందుకు నిందితులు ఇలా చేశార‌ని సీబీఐ పేర్కొన్న‌ది. ప్రయివేటు కోచింగ్ సెష‌న్స్ సంద‌ర్భాల్లో లీక్ చేసిన ప్ర‌శ్న‌ల‌ను విద్యార్థుల‌తో రాయించార‌ని, వాటికి సంబంధించిన ఆధారాల‌ను సేక‌రించిన‌ట్టు కూడా సీబీఐ త‌న ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. తేలికైన ప్ర‌శ్న‌ల‌ను కంఠ‌స్తం చేసి, ఆ త‌ర్వాత త‌మ హోట‌ల్ రూమ్‌లో వాటిని పేప‌ర్‌పై రాసుకునేవార‌ని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ అధికారులు తెలిపారు.

అనేక బ్యాంక్ అకౌంట్లు, లాకర్లు, డీమాట్ అకౌంట్లు సీజ్ ..!
గత మే 12 వ తేదీన పేప‌ర్ లీకేజీ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. 72 మంది ఆఫీస‌ర్ల‌తో బృందాల‌ను ఏర్పాటు చేసింది. 8 మంది సైబ‌ర్ ఫోరెన్సిక్ నిపుణులు కూడా సీబీఐ విచార‌ణ‌కు స‌హ‌క‌రించారని తెలిపింది. మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, ఢిల్లీతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోని 92 ప్రాంతాలలో సోదాలు చేప‌ట్టారు. ఆ త‌నిఖీల్లో డిజిట‌ల్, క‌మ్యూనికేష‌న్ డివైస్‌లు, డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఆధారాల‌కు చెందిన ఫోరెన్సిక్ ఇమేజింగ్ జ‌రిగిన‌ట్లు సీబీఐ వెల్ల‌డించింది. మే 13వ తేదీన ఈ కేసులో తొలి నిందితుడిని అరెస్టు చేశారు. కోచింగ్ సెంట‌ర్ల‌కు చెందిన ఇద్ద‌రిని అరెస్టు చేశారు. డ‌బ్బు లావాదేవీల కోణంలోనూ కూడా ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అనేక బ్యాంక్ అకౌంట్లు, బ్యాంక్ లాక‌ర్లు, డీమాట్ అకౌంట్ల‌ను సీజ్ చేసిన‌ట్లు సీబీఐ త‌న రిపోర్టులో పేర్కొన్న‌ది.

360 మంది సాక్షులు.. 13 మంది నిందితులు..
ఎన్టీఏ విధి నిర్వ‌హ‌ణ‌లోనూ లోపాలు ఉన్న‌ట్టు ఏసీబీ అధికారులు గుర్తించామన్నారు. ఎన్టీఏ కేంద్రం వ‌ద్ద చెకింగ్ కానీ ఫ్రిస్కింగ్ కానీ స‌మ‌ర్థ‌వంతంగా లేవని తెలిపారు. పీవీ కుల‌క‌ర్ణి ఈ కేసులో ఏ2 నిందితుడని, అత‌ను మూడు సెట్ల ప్ర‌శ్నాప‌త్రాల‌కు చెందిన ట్రాన్స్‌లేష‌న్ వ‌ర్క్ కూడా చేశారని తెలిపారు. మూడు రోజుల వ్య‌వ‌ధిలో అత‌ను 135 ప్ర‌శ్న‌ల‌ను ట్రాన్స్‌లేట్ చేశాడ‌ని త‌న ఛార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొన్న‌ది. 13 మంది నిందితుల్లో ముగ్గురు ఎన్టీఏ స‌బ్జెక్ట్ నిపుణులు, కోచింగ్ వ్య‌క్తులు, మ‌ధ్య‌వ‌ర్తులు, లాభ‌ప‌డిన విద్యార్థులు ఉన్నారని తెలిపింది. ఎన్టీఏలో ప‌నిచేస్తున్న‌ కొంద‌రు త‌మ అధికారాన్ని వాడుకుని ర‌హ‌స్య స‌మాచారాన్ని సేక‌రించిన‌ట్టు గుర్తించామన్నారు. ఈ కేసుతో లింకున్న‌ సుమారు 20 వేల పేజీల ఆధారాల‌ను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ స‌మ‌ర్పించింది. విచార‌ణ‌లో భాగంగా 360 మంది సాక్ష్యుల‌ను పేర్కొన్న‌ది. ప్ర‌స్తుతం 13 మంది నిందితులు జుడిషియ‌ల్ క‌స్ట‌డీలోనే ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -