Saturday, August 8, 2026
E-PAPER
Homeజాతీయంతగినంత ఎరువులు ఇవ్వండి

తగినంత ఎరువులు ఇవ్వండి

- Advertisement -

కేంద్రమంత్రి నడ్డాకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

తెలంగాణలో రైతులకు ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా తక్షణమే తగినంత డీఏపీ ఎరువులను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు కోరారు. ఈ మేర‌కు శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను ఎంపీలు సురేశ్‌ షెట్కర్‌, ఎంపీ మల్లు రవి క‌లిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో తగినంత డీఏపీ ఎరువులను కేటాయించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఎరువుల అవసరం, సరఫరా, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ప్రస్తుత సాగు సీజన్‌లో రైతులకు తగినంత ఎరువుల లభ్యతను నిర్ధారించాల్సిన తక్షణ అవసరాన్ని ఎంపీలు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర రైతాంగ సంక్షేమాన్ని కాంక్షిస్తూ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలందరూ సంతకాలు చేసిన ప్రతిపాదన పత్రాన్ని కేంద్రమంత్రికి అందజేసినట్టు తెలిపారు. త‌మ విజ్ఞప్తిపై జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారన్నారు. రాష్ట్రంలోని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, డీఏపీ ఎరువుల సరఫరా అంశాన్ని ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన‌ట్టు ఎంపీ మ‌ల్లు ర‌వి వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -