Saturday, March 28, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబాబోయ్.. దోమలు..!

బాబోయ్.. దోమలు..!

- Advertisement -

రాత్రివేళ స్వైర విహారం.. ప్రతి ఇంటా జ్వర బాధితులే
పదుల సంఖ్యలో డెంగ్యూ కేసులు
డివిజన్ల విభజనతో ఇబ్బందులు
‘ఎంటమాలజీ’ పనితీరుపై విమర్శలు

నవతెలంగాణ-సిటీబ్యూరో
దోమల సమస్య రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో దోమలు విజృంభిస్తుండటంతో ప్రజలు నిద్ర లేక ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఎండాకాలం.. మార్చిలోనే ఉక్కపోత తీవ్రంగా ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. బస్తీ ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతుండగా.. ప్రతి ఇంటా జ్వరం కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా బస్తీల్లో డెంగ్యూ, మలేరియా జ్వరాలు పెరుగుతున్నాయి. ఇంటింటి తనిఖీల్లేకపోవడంతో జ్వరాలతో బస్తీవాసులు మంచాన పడుతున్నారు. మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎంటమాలజీ విభాగం బలహీనంగా ఉండటం, ఇటీవల బదీలీలు జరగడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇంటింటి తనిఖీలను ముమ్మరం చేసి దోమల వ్యాప్తిని అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వైద్యం దైన్యం.. మలేరియా పంజా
‘ఎంఎంసీ’ పరిధిలో మలేరియా జ్వరాలు విస్తరిస్తున్నాయి. పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఉపాధి నిమిత్తం అల్వాల్‌కు వలస వచ్చిన కుటుంబంలో ఓ మహిళకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మలేరియా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వైద్యులు అత్యవసర చికిత్స కోసం గాంధీ లేదా ఉస్మానియా ఆస్పత్రి తీసుకెళ్లాలని సూచించారు. మరుసటి రోజు ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతోనే ఆ మహిళ మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మొక్కుబడిగా ఎంటమాలజీ విభాగం..!
కార్పొరేషన్‌కు పారిశుధ్య విభాగం ఎంత ముఖ్యమో..? ఎంటమాలజీ అంతే. కానీ, తాజాగా జీహెచ్‌ఎంసీ సిబ్బందిని మూడు కార్పొరేషన్లకు బదిలీ చేయడంతో ఎంటమాలజీ విభాగం మరింత బలహీనమైంది. ఫాగింగ్‌ మిషిన్లు పనిచేయక, ఇంటింటి తనిఖీలు జరగక ప్రజలు దోమకాటుతో ఆస్పత్రులపాలవుతున్నారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఎంటమాలజీ విభాగాన్ని బలోపేతం చేయడంపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. కార్పొరేషన్‌కు చీఫ్‌ ఎంటమాలజిస్టు (సీఈ), 3 జోన్లకు ముగ్గురు సీనియర్‌ ఎంటమాలజిస్టులు (ఎస్‌ఈ), 14 సర్కిళ్లకు సహాయ ఎంటమాలజిస్టులు (ఏఈ), డివిజన్‌కో ఎంటమాలజీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు (ఈఎస్‌ఏ), వారి కింద కార్మికులు పని చేయాల్సి ఉంది. మల్కాజిగిరి కార్పొరేషన్‌ పరిధిలోని డివిజన్లకు ఉమ్మడి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న అధికారులు, సిబ్బందినే సర్దడంతో ‘ఎంఎంసీ’ ఎంటమాలజీ విభాగం మొక్కుబడిగా మారింది.

దీనికితోడు దోమల నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేయించాల్సిన విభాగాధిపతి లేకపోవడం, మూడు జోన్లకు ఎస్‌ఈలే లేకపోవడంతో అసలే అరకొరగా జరిగే నియంత్రణ చర్యలు దాదాపు శూన్యమయ్యాయి. మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చీఫ్‌ ఎంటమాలజిస్టు లేకపోవడంతో ఆరోగ్య విభాగం అదనపు కమిషనరే ఆ బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తోంది. పని ఒత్తిడి, తీరిక లేకపోవడం వంటి కారణాలతో ఎంటమాలజీ విభాగాన్ని అదనపు కమిషనర్‌ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల జీహెచ్‌ఎంసీ మూడుగా విడిపోవడంతో కార్మికులను ఒక జోన్‌ నుంచి మరో జోన్‌కు, ఒక కార్పొరేషన్‌ నుంచి మరో కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. చాలా మందిని దూరంలో ఉండే డివిజన్లకు బదిలీలపై పంపించడంతో ఇండ్ల నుంచి పని ప్రదేశం చాలా దూరం కావడంతో అక్కడ విధి నిర్వహణకు కార్మికులు విముఖత కనబరుస్తున్నారు. ఇది పారిశుధ్య, వైద్య సేవలపై ప్రభావం చూపుతూ నగరంలో జ్వరాల తీవ్రతకు కారణమవుతోంది.

దోమల నియంత్రణకు చర్యలేవీ..?
అపార్టుమెంట్లు, పని ప్రదేశాలు, నిర్మాణ పనుల వద్ద కూలీల కోసం ఏర్పాటు చేసే శిబిరాలు దోమలకు అడ్డాగా మారుతున్నాయి. ఆయా నిర్మాణదారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. పొట్టకూటి కోసం వచ్చిన పేదలు డెంగ్యూ, మలేరియా వ్యాధుల బారిన పడుతున్నారు. బస్తీలు, మధ్యతరగతి ప్రజలు నివసించే కాలనీల్లో దోమల నియంత్రణ చర్యలను అధికారులు, సిబ్బంది చేపట్టడం లేదు. రోజువారీగా నమోదయ్యే డెంగ్యూ, మలేరియా కేసుల వివరాలు తెలుసుకుని 24 గంటల్లో బాధితులకు వైద్య చికిత్సలందేలా చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు.. వారి బాధ్యతలను విస్మరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -