Saturday, August 8, 2026
E-PAPER
Homeజిల్లాలునల్లమల్లలో అంతరిస్తున్న చెంచు జాతి

నల్లమల్లలో అంతరిస్తున్న చెంచు జాతి

- Advertisement -

వారి జీవిత ఆయుషు 40 ఏండ్లే..
రేపు ప్రపంచ ఆదివాసి దినోత్సవం..
నవతెలంగాణ-అచ్చంపేట
భూమ్మీద జీవించే ప్రతి జీవికి తమ ఆయుష్షు ఇన్నేండ్లని ఉంటుంది. ఉదాహరణకు మనిషి జీవిత ఆయుష్షు వందేండ్లని అంచనా ఉంటుంది. కానీ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న జంతు జాతి వారి ఆయుషు 40 ఏండ్లే. ఏడాదికి ఏడాది సాధారణంగా మానవ జాతి అభివృద్ధి చెంది, జనాభా సంఖ్య పెరుగుతుంటే..ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా చెంచుజాతి నానాటికీ అంతరించిపోతోంది. అటవీ ప్రాంతంలో ఇప్పటికే చెంచు పెంటలు సైతం కనుమరుగయ్యాయి. పెద్దవాగు పెంట, తాటి గుండాల, పేరుట్ల, దౌర్యాల, ఆరు తీగల పెంట, పెద్ద రాయలేటి, గుండాలపెంట, ఇలా 10 చెంచు పెంటలు చరిత్రలో కలిసిపోయాయి.

చెంచు మహిళలు 18, 19 ఏళ్లకే ఇద్దరు, ముగ్గురు పిల్లల సంతానం కలిగి ఉంటున్నారు. సమయానికి సరైన వైద్యం అందకా..25-35 ఏండ్ల మధ్యనే భర్తలు చనిపోతున్నారు. దీంతో భార్యలు పిల్లలతో పాటు ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఇలాంటి మహిళలు చెంచుపెంటలలో పదుల సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం అప్పాపురం, కదిలివనం, ఈర్లపెంట, బైరాపూర్, రాంపూర్ పెంట, పుల్లయ్యపల్లి పెంట, మల్లాపూర్,  ఫరహాబాద్, రాయలేటి పెంట, అగర్ల పెంట, మేడి మొలకల, సంగడి గుండాల పెంటలలో చెంచులు జీవిస్తున్నారు. వీరు ఎక్కువగా అటవీ సంపద పైన ఆధారపడి జీవిస్తారు. అడవిలో లభించే ముష్టి గింజలు, తేనె కుంకుడు కాయలు, చీపుర్లు మొదలగు ఉత్పత్తులను సేకరించి గిరిజన కార్పొరేషన్ కు విక్రయించి జీవిస్తారు. మారుతున్న జీవన విధాన శైలి వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉండడంతో చెంచుల మనగడ ప్రశ్నార్థకంగా మారింది.

అధిక చెంచుపెంటలలో ప్రధానంగా గర్భిణీ మహిళలు పోషకాహారం లోపంతో రక్తహీనత, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ప్రసూతి సమయంలో తక్కువ బరువుతో గల శిశువులు జన్మిస్తున్నారు. పురుషులు లివర్ సమస్యలతో చనిపోతున్నారు. ఏ చెంచుపెంటలో చూసిన భర్త చనిపోయిన మహిళలు పదుల సంఖ్యలో తారసపడతారు. ప్రస్తుతం ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో లివర్ సమస్యతో చికిత్స పొందుతున్నారని సమాచారం.!

చెంచుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ కూడా నిర్వీర్యం అవుతోంది. ప్రభుత్వాలు, పాలకులు ఐటీడీఏను నిర్లక్ష్యం చేస్తున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఐటీడీఏ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి అటవీ ప్రాంతంలో నివాసముంటున్న చెంచు జాతికి కావలసిన వనరులు గుర్తించి వారికి మౌలిక వసతులు కల్పించడమే ఐటిడిఏ ( ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ) ప్రధాన లక్ష్యం. ఒకప్పుడు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఐఏఎస్ క్యాడర్ కలిగిన అధికారి పర్యవేక్షణ చూసేవారు. ప్రస్తుతం గత 15 ఏళ్లుగా ఐటీడీఏకు పిఓగా ఇన్చార్జి అధికారులను కేటాయిస్తున్నారు. సిబ్బంది కూడా ఇతర చోట్ల నుంచి డిప్యూటేషన్ పద్ధతిలో పనులు కొనసాగిస్తున్నారు.

మన్ననూరు ఐటిడిఏ పరిధిలో నాగర్ కర్నూల్, వికారాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలో 88 మండలాల పరిధిలో 150 గ్రామాలు పెంటలలో చెంచులు నివాసం ఉంటున్నారు. 2018 ఐటీడీఏ అధికారుల లెక్కల ప్రకారంగా 4500 కుటుంబాలు, 15,500 జనాభా ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికీ అధికారులు చెంచు జనాభా వివరాలు అడిగితే.. 2018 ఏడాది లెక్కలు మాత్రమే చెప్తున్నారు. ఒకప్పుడు చెంచు జాతి ఉండేదంట అని భవిష్యత్తు తరాలు మాట్లాడుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇకనైనా ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు వెంటనే స్పందించి.. అంతరించి పోతున్న చెంచుజాతికి కావాల్సిన వైద్యం, వసతి, విద్య, వనరులు కల్పించి ఆ జాతిని కాపాడాలని స్థానిక ప్రజానీకం కోరుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -