Sunday, August 9, 2026
E-PAPER
Homeసమీక్షమరుగున పడిన పోరాట చరిత్ర

మరుగున పడిన పోరాట చరిత్ర

- Advertisement -

తెలుగు సాహిత్య రంగంలో మూర్తి కె.వి.వి.ఎస్‌. ఒక వినూత్న అనువాదకులుగా అందరికీ పరిచయమైన వారే. మేరియో ఫుజో ‘గాడ్‌ ఫాదర్‌’ నవలను తెలుగులోకి అనువదించి, తన అనువాద సేద్యాన్ని ప్రారంభించారు. వీరు మౌలికంగా ఆంగ్ల సాహిత్య అధ్యయన శీలురు. ఈ నేపథ్యంలో ఆంగ్ల సాహిత్యలో వున్న అద్భుతమైన, అరుదైన నవలలను తెలుగు సాహితీ ప్రియులకు అందించాలనే వారి అనువాద సంకల్పం చాలా గొప్పది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరి అనువాద కలం నుండి జాలువారినదే ‘మిష్మి కొండలు’ అనే ఈ నవల. ఈ నవలని అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మమాంగ్‌ డారు ఇంగ్లీష్‌లో రాయగా మూర్తి దీనిని మనకు తెలుగులో అందించారు. ‘గౌరహరిదాస్‌’ కథలు అనువాదంలో వీరి కలం అందుకున్న ఉత్కష్టత ఈ ‘మిష్మి కొండలు’ నవలానువాదంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంది. ఈ నవలను ఇప్పుడే చదివిన తర్వాత నాకు అన్పిస్తున్నది ఏమిటంటే? మూర్తిగారే స్వయంగా ఎగువ అస్సామ్‌, మిష్మి కొండలు లగాయతు టిబెట్‌ వరకు గల దుర్గమారణ్యాలలోనూ, మహోన్నత పర్వతశ్రేణుల మీద, వాగులు, నదులు, లోయలలోనూ స్వయంగా తిరిగి, చూసి, అనుభవించి, అక్కడి గిరి జాతులతో కలిసిపోయి, వారిలో ఒకడైపోయి, ఆ ప్రకతినంతా, ఆ చరిత్ర నంతా తన గుండెలో నిలుపుకుని స్వయంగా ఈ నవలను రాశారేమో అనిపించింది. ఎక్కడా ఒక పదంగాని, వాక్యం గాని ఇది అనువాదం అనిపించదు.

బ్రిటిష్‌ మనదేశ అటవీ ప్రాంతాలను, పర్వత శ్రేణులను తమ వనరులుగా (కలప, గనులు మొదలగునవి) వాడుకోవడం నిమిత్తం వారు ఈప్రాంతాల్లోకి ఎలా చొచ్చుకువచ్చారు, దీనికి వ్యతిరేకంగా స్థానిక గిరిజాతుల తిరుగుబాటు ప్రయత్నాలు ఎలా సాగాయన్నవి ఒకపాయ, దీనితో సమాంతరంగా ఫ్రెంచ్‌ దేశీయుడైన ఒక క్రైస్తవ సన్యాసి పేరు క్రిక్‌ తమ చర్చ్‌ ఉన్నత వర్గం ఆదేశాలు, అనుమతితో ఈ పర్వత ప్రాంతాలలో సందర్శించి అలా టిబెట్‌లోకి ప్రవేశించి క్రీస్తు వాక్యాన్ని వినిపించి అక్కడ ప్రజలను, గిరిజాతులను క్రైస్తవీకరించే కార్యక్రమం ఇది రెండవ పాయ.
ఇంకా స్థానిక ఆబోర్‌ జాతికి చెందిన ఒక యువతి గీమూర్‌, మరో గిరిజాతికి చెందిన యువకుడైన కజిన్‌ ష మధ్య పుష్పించిన ప్రేమ, పర్యావసానంగా గీమూర్‌ తన ఊరిని, తన జాతిని వదిలేసి తన ప్రేమకోసం కజిన్‌ ష ఊరు వెళ్లిపోవడం, అక్కడ తాను కజిన్‌కి రెండవ భార్యనని తెలుసుకొని ఇంకా వేరే యువతితో సంబంధం ఉన్నదన్న అనుమానంతో, మనస్తాపం చెంది అతనిని వదిలి తిరిగి తన గ్రామానికి వచ్చేయడం, ఈ క్రమంలో తన జాతికే చెందిన తన చిన్ననాటి స్నేహితుడు చేసిన మేలు, మళ్ళీ కజిన్‌ ష వచ్చి గీమూర్ని తనతో తీసుకుపోవడం-

ఈ సంఘటనల పరంపరలో క్రైస్తవ సన్యాసి క్రిక్‌ తమ ప్రాంతాలకు రావడం వీరు వ్యతిరేకించడం, అయినా గాని ఈ సన్యాసి చేస్తున్న వైద్యం అతని మంచి మాట తీరు, వారికి నచ్చి అతనితో స్నేహభావాన్ని కొనసాగించడం- ఈ ముప్పేట వాల్జడని రచయిత్రి మమాంగ్‌ డారు ఎంత అందంగా అల్లారో తెలుసుకోవాలంటే, క్రైస్తవ మతప్రచార చరిత్రలోకి తొంగి చూడాలనుకుంటే, మరుగునపడిన ఒక పోరాట చరిత్రని తెలుసుకోవాలనుకుంటే అలాగే మానవ మస్తిష్కం, మనసు, ప్రవర్తనా రీతులు ఎంత విచిత్రంగా వుంటాయో తెలుసుకోవాలనుకుంటే ఈ నవలను చదివి తీరాల్సిందే.

డా. అలజంగి మురళీధరరావు, 9440335461

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -