Sunday, August 9, 2026
E-PAPER
Homeసోపతిఎడారి గుండెల్లో దాగిన జ్ఞాననిధి

ఎడారి గుండెల్లో దాగిన జ్ఞాననిధి

- Advertisement -

ఎక్కడ చూసినా ఇసుక.. మండే ఎండలు… దూరంగా కనిపించే ఒంటెల బారులు… ఎడారి గాలికి ఎగిరే ఇసుక తుఫాన్లు.. రాజస్థాన్‌ అంటే మనకు తెలిసిన చిత్రం ఇదే. ఎండిన నేల, దప్పికతో అల్లాడే గుండెలు, అన్నీ ఆరిపోయినట్టు అనిపించే ఈ ప్రదేశంలో.. ఒక్కసారి ఊహించండి. ఈ ఎడారి గుండెల్లో, కనిపించని లోతుల్లో, సమయం ఆగిపోయినట్టు నిశ్చలంగా నిలిచిన ఓ మహోన్నత జ్ఞానాలయం ఉంటే! మనసులో కలవరం పుట్టదా? మనం నమ్మలేని ఓ అద్భుతం అక్కడ ఎదురుచూస్తోంది. అదే ‘శ్రీ భదారియా మాతాజీ ఆలయం’ కింద 20 అడుగుల లోతున ఉన్న భూగర్భ గ్రంథాలయం.

సుమారు 15,000 చదరపు అడుగుల విశాలమైన ఆ భూగర్భ ప్రదేశంలోకి అడుగుపెడితే కళ్ళకు కనిపించేది ఓ అద్భుత దృశ్యం. ఎంతో క్రమంగా వరుసలు కట్టి నిలబడి ఉన్న 562 అలమార్లు. ఒక్కొక్క అలమారు ఎంతో గాంభీర్యంగా, ఒక యోధుడిలా, కాలాన్ని సవాలు చేస్తున్నట్టు నిలుచున్నాయి. వాటిపై ఉన్నవి కేవలం పుస్తకాలు కావు. అవి రెండు లక్షలకు పైగా జీవన్మతులు, కాలాన్ని కాపాడుతున్న సైనికులు! ఒక్కొక్క పుస్తకం మనతో ఒక యుగం కథని చెబుతోంది. ఒక్కొక్క పేజీ మనకు ఓ నాగరికత ఊపిరి పరిచయం చేస్తోంది. అవి కాగితపు ముద్దలు కావు.. సాక్షాత్తు మనిషి ఆలోచనా ప్రవాహ స్తంభీభూత స్వరూపం.

ఆ మహనీయుని కల : ఈ అద్భుత నిర్మాణానికి వెనుక ఒక గొప్ప ఆత్మ ఉంది. ఆయనే ‘హర్వంశ్‌ సింగ్‌ నిర్మల్‌’. పంజాబ్‌కు చెందిన ఓ ఆధ్యాత్మిక వేత్త. 25 ఏండ్ల పాటు అక్కడి ఆలయ ప్రాంగణంలోని ఓ గుహలో తపస్సు చేసారు. ఎన్ని కష్టాలో! ఏ వేడో, ఏ చలో, ఏ ఏకాంతమో సహించి, మానవాళికి ఓ మహత్తర కానుక అందించాలని తపించారు. ఆయనకు గట్టి నమ్మకం.. మతమేదైనా, కులమేదైనా, భాషేదైనా, జ్ఞానం మాత్రమే మనల్ని ఏకం చేస్తుంది. ‘ప్రపంచమంతా జ్ఞానం కోసం ఇక్కడికి రావాలి’ అని కలలు కన్నారు. ఆయన కలే ఈ భూగర్భ గ్రంథాలయం రూపంలో నేడు మన ముందు నిలిచింది. ఇది కేవలం నిర్మాణం కాదు.. ఓ మహనీయుని శతాబ్దాల స్వప్నం.

సృష్టి కథ : 1983లో ఈ అద్భుత నిర్మాణం మొదలైంది. పదిహేనేండ్ల కృషి.. వేలాది మంది కార్మికులు, భక్తులు, స్వచ్ఛందసేవకులు.. ఎవరో ఒకరు రాయి మోస్తే, మరొకరు సిమెంట్‌ కలుపుతే.. ఇలా వేల చేతుల మీదుగా అది సాకారమైంది. తర్వాత దేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి పుస్తకాలు చేరాయి. ఎవరో తమ వద్ద ఉన్న అరుదైన గ్రంథాన్ని కానుకగా ఇస్తే, ఇంకొకరు పాతకాలం నాటి హస్తప్రతిని భద్రపరుస్తే.. ఇలా లక్షల కొద్దీ పుస్తకాలు పోగయ్యాయి. ఒక్కొక్క పుస్తకం వెనుక ఒక్కొక్క కథ ఉంది. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క మనిషి ప్రాణాన్ని, సమయాన్ని, ప్రేమను తనలో దాచుకుంది.

కాలం మించిన జ్ఞానం : ఈ గ్రంథాలయంలో హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాల పవిత్ర గ్రంథాలు.. తత్వశాస్త్రం, చరిత్ర, భూగోళశాస్త్రం, వైద్యం, న్యాయశాస్త్రం, నవలలు, కవిత్వం.. ఏ విభాగం చూసినా అద్భుతమే. ముఖ్యంగా అక్కడి కొన్ని పుస్తకాలు వెయ్యేండ్ల నాటివి! చెట్టు బెరడుపై రాసిన గ్రంథాలు, అరుదైన పాత ముద్రణలు.. అవి ఎంతో ప్రత్యేకమైన పెట్టెల్లో, ఎంతో జాగ్రత్తగా కాపాడబడుతున్నాయి. అవి కేవలం పుస్తకాలు కావు భారతీయ జ్ఞానపారంపర్యానికి నిలువెత్తు సాక్ష్యాలు. ఎన్నో తరాలు వచ్చిపోయాయి.. ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోయాయి.. కానీ ఈ పుస్తకాల్లోని జ్ఞానం నేటికీ ప్రాణంతో ఉంది.

ఎడారిలో రక్షణ :
ఈ గ్రంథాలయం భూగర్భంలో నిర్మించడానికి ఓ కారణం వుంది. సమీపంలోని పోఖ్రాన్‌ ప్రాంతంలో ఎగిసే ఇసుక, మండే ఎడారి వేడి పుస్తకాలకు విరుగుడు. అందుకే భూమి అడుగున, చల్లని, సురక్షితమైన ప్రదేశంలో దీన్ని నిర్మించారు. భారీ ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు, గాలిలో తేమను నియంత్రించే సంప్రదాయ పద్ధతులు, ప్రతి పుస్తకాన్ని కాలానుగుణంగా తెరిచి గాలి తగిలించడం.. ఇలా ఎన్నో జాగ్రత్తలు. అక్కడి సిబ్బందికి పుస్తకాలు సంరక్షించడం ఉద్యోగం కాదు.. ఒక యజ్ఞం. పుస్తకాలంటే ఎంత మమకారమో! ఎంత ప్రేమమో! ప్రతి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు ఆ ఆలయానికి వస్తారు. వారిలో చాలామంది మొదట ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత ఈ భూగర్భ గ్రంథాలయంలోకి అడుగుపెడతారు.

జ్ఞానానికి నిలయం : ఈ గ్రంథాలయం మనకు మరో గొప్ప పాఠం బోధిస్తోంది. దేవాలయాలు కేవలం ప్రార్థనలకు మాత్రమే పరిమితం కాకూడదు. అవి జ్ఞానానికి కూడా నిలయాలుగా మారాలి. పుస్తకాన్ని సంరక్షించడం అంటే కేవలం కాగితాన్ని కాపాడటం కాదు.. ఒక జాతి చరిత్రను, సంస్కతిని, భావితరాల ఆశను కాపాడటం. ఈ విషయాన్ని భదారియా గ్రంథాలయం చాలా స్పష్టంగా, నిశ్శబ్దంగా మనకు గుర్తుచేస్తోంది. ఎన్నో ఏండ్ల కిందట ఎవరో రాసిన మాట ఈరోజు మన మనసును కదిలిస్తుందంటే అది పుస్తకాల మహిమ. జైసల్మేర్‌ భూగర్భ గ్రంథాలయం కేవలం రాజస్థాన్‌ గర్వకారణం మాత్రమే కాదు. అది భారతదేశ పఠన సంస్కృతికి, మానవతా విలువలకు, జ్ఞాన సంపదకు చిరస్థాయిగా నిలిచే అపూర్వ చిహ్నం.

– డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -