కొన్ని గొడవలకు కారణాలు మర్చిపోతాం. కానీ ఆ గొడవలో మనం ఎంతగా ఒకరిని ఒకరం మిస్సయ్యామో మాత్రం తప్పక గుర్తుండిపోతుంది. ఆ రోజు అలాంటి రోజే. సాయంత్రం ఆఫీసులో పని కొంచెం ఎక్కువైంది. ఫోన్ సైలెంట్లో ఉంది. ఆమె నుంచి వచ్చిన కాల్స్ చూడలేదు. మెసేజ్లు కూడా. రాత్రి తొమ్మిదిన్నరకి పని పూర్తయ్యాక ఫోన్ చేతిలోకి తీసుకున్నాను. ఆమె నుంచి నాలుగు మిస్డ్ కాల్స్. మూడు మెసేజ్లు.
‘ఎక్కడున్నావ్?’
‘నీకు ఒక విషయం చెప్పాలి.’
‘ఒక్కసారి ఫోన్ చేయొచ్చు కదా.’
నేను వెంటనే కాల్ చేశాను. రెండుసార్లు ఎత్తలేదు. మూడోసారి ఎత్తింది.
‘హలో.’
ఆ ఒక్క మాటతోనే ఆమె కోపంగా ఉందని తెలిసిపోయింది.
‘సారీ… పని…’
‘పని ఉంటుందని నాకు తెలియదా?’
ఆమె మాట మధ్యలోనే ఆపేసింది.
‘అది కాదు…’
‘అయితే ఏంటి?’
నేను కాసేపు మౌనంగా ఉన్నాను. ఆమెకు కావలసింది కారణం కాదు. తనను నేను నిర్లక్ష్యం చేయకూడదనే భావన. అది నాకు అప్పుడు అర్థం కాలేదు.
‘ఫోన్ చూడలేదు అంతే.’ అన్నాను.
‘సరే.’
‘బుజ్జీ…’
‘సరే అన్నాను కదా.’
అని ఫోన్ పెట్టేసింది. మరుసటి రోజు కూడా మాట్లాడలేదు. మెసేజ్ పంపాను. చూసింది. స్పందించలేదు. నాకు ఆమె మౌనం మీద కోపం రాలేదు. నా నిర్లక్ష్యమే నన్ను ఎక్కువ బాధపెట్టింది. ఫోన్ చేయకపోవడం ఒక తప్పయితే… ఆమె ఎదురు చూసిందని గుర్తించకపోవడం ఇంకా పెద్ద తప్పు. అప్పుడు నాకు తెలిసింది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం నిశ్శబ్దం అని. మూడో రోజు ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు ఆమె ఇంటి దగ్గరకు వెళ్లి కింద నిలబడ్డాను…
కొద్దిసేపటికి బాల్కనీలో కనిపించింది. లేత నీలం రంగు దుస్తులు. వదిలేసిన జుట్టు. చేతిలో పొగలు కక్కుతున్న కాఫీ కప్పు. సాయంత్రం నెమ్మదిగా రాత్రిలోకి జారిపోతోంది. బాల్కనీ లైట్ వెలిగింది. ఆ వెలుతురులో ఆమె ముఖం ప్రశాంతంగా కనిపించినా… ఆ ప్రశాంతత వెనుక ఇంకా కరగని అలక దాక్కుని ఉంది. నన్ను చూసింది. నేను చేయి ఊపాను. ఆమె స్పందించలేదు. కాఫీ తాగుతూ రోడ్డువైపు చూసింది. నన్ను చూడనట్టే నటిస్తోంది. నేను నవ్వుకున్నాను. ఐదు నిమిషాల తర్వాత ఫోన్ మోగింది. ఆమెనే.
‘ఏం చేస్తున్నావ్?’
‘నిలబడి ఉన్నాను.’
‘ఎందుకు?’
‘నిన్ను చూడాలని.’
‘చూసావ్ కదా, వెళ్లు.’
‘సరిగ్గా చూడలేదు.’
అవతల కొన్ని క్షణాలు మౌనం.
‘రామ్…’
‘V్ా్మ?’
‘నిజంగా నీకు తప్పు ఏంటో అర్థం కాలేదా?’
ఆ ప్రశ్నలో కోపం లేదు. కొంచెం బాధ మాత్రమే ఉంది. నేను నెమ్మదిగా అన్నాను.
‘ఇప్పుడు అర్థమవుతోంది.’
‘ఏంటి?’
‘నువ్వు ఫోన్ చేసినప్పుడు మాట్లాడలేకపోవడం కాదు సమస్య.’
‘మరి?’
‘నువ్వు ఎదురు చూస్తున్నావని గుర్తించకపోవడం.’
కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. కాఫీ కప్పును పక్కన పెట్టింది. తర్వాత మెల్లగా అంది.
‘పైకి రా.’
కాల్ కట్ అయింది. మెట్లవైపు నడిచాను. ప్రతి మెట్టు ఎక్కేకొద్దీ మూడు రోజుల దూరం కొంచెం కొంచెంగా తగ్గిపోతున్నట్టే అనిపించింది. తలుపు కొట్టగానే తెరిచింది ఆమె కాదు. ఆంటీ. నన్ను చూసి చిరునవ్వు నవ్వారు.
‘రా బాబూ… చివరికి మా ఇంటి అడ్రస్ గుర్తొచ్చిందన్నమాట.’ నేను నవ్వాను. లోపల నుంచి ఆమె స్వరం.
‘అమ్మా… ఎవరు?’
‘ఎవరి మీద కోపంగా ఉన్నావో వాళ్లే.’
లోపల కాసేపు నిశ్శబ్దం.
‘రా… హాల్లో ఉంది’ అన్నారు ఆంటీ.
ఆమె సోఫాలో కూర్చుని ఉంది. నేను ఎదురుగా కూర్చున్నాను. మధ్యలో టీపారు. దాని మీద మూడు రోజుల నిశ్శబ్దం. కొద్దిసేపు చిన్నచిన్న విషయాలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత..
‘తెలుసా… ఆ రోజు నేను ఒక మంచి వార్త చెప్పాలని ఫోన్ చేశాను’ అంది ఆమె.
‘ఏ వార్త?’
‘గుర్తుందా.. నేను పంపిన ఆ ఆడిషన్ వీడియో?’
‘గుర్తుంది.’
‘దానికి సెలెక్ట్ అయ్యాను.’
‘వావ్.. ఇక ప్రపంచానికి మరో గాయని పరిచయం కానుందన్నమాట.’
ఆమె చిన్నగా నవ్వింది.
‘అంత ఓవర్ చేయకు.’
‘నేను ఓవర్ చేయడం లేదు. రేపు పెద్ద సింగర్ అయ్యాక ఇంటర్వ్యూల్లో నన్ను మర్చిపోవద్దు.’
‘ముందు ఫోన్ ఎత్తడం నేర్చుకో. తర్వాత ఇంటర్వ్యూల గురించి మాట్లాడదాం.’
ఈసారి నేనూ నవ్వేశాను. తర్వాత ఆమె కాసేపు మౌనంగా ఉండి నన్ను చూసింది.
‘ఆ విషయం ముందు నీకే చెప్పాలనిపించింది.’
ఆ మాట విన్న తర్వాత నా చేతిలో ఉన్న కాఫీ కప్పు ఒక్కసారిగా భారంగా అనిపించింది. అంతలో ఆంటీ వేడివేడిగా బజ్జీల ప్లేట్ తీసుకొచ్చారు.
‘ఇదిగో… మూడు రోజుల గొడవకు ఇవి రాజీ బజ్జీలు.’
ఆమె ముఖం ఎర్రబడిపోయింది.
‘అమ్మా!’
‘ఏంటి? నిజం కాదా?’
ఈసారి ముగ్గురం నవ్వుకున్నాం. ఆ నవ్వుతో మూడు రోజుల మౌనం పూర్తిగా కరిగిపోయింది. రాత్రి ఇంటికి వచ్చాక ఫోన్లో ఒక మెసేజ్ మెరిసింది.
‘భోజనం చేశావా?’
నేను నవ్వుకున్నాను. కొన్ని ప్రేమలు ‘ఐ లవ్ యూ’ అనే మూడు మాటలతో కాదు.. ‘భోజనం చేశావా?’ అనే రెండు మాటలతో బతుకుతాయి.
– రామ్
సండే 6 పిఎం
- Advertisement -
- Advertisement -



