పత్రిక కేవలం వార్తలను ముద్రించే కాగితం కాదు. అది కాలానికి అద్దం. సమాజానికి దిక్సూచి. అధికారానికి జవాబుదారీతనాన్ని గుర్తు చేసే అక్షర శక్తి. ప్రజల విశ్వాసాన్ని సంపాదించినప్పుడే ఒక దినపత్రిక తన ఉనికిని సార్థకం చేసుకుంటుంది. ఆ విశ్వాసాన్ని పదకొండేండ్లు నిలబెట్టుకుంటూ ప్రజల గొంతుకగా సాగుతున్న సంస్థ నవతెలంగాణ.
‘జర్నలిజం’ అనే పదంలోనే ‘నిజం’ దాగి ఉంది. జర్నలిజం అంటే వాస్తవాన్ని వక్రీకరించకుండా సమాజం ముందుంచడం. అధికారాన్ని ప్రశ్నించడం. బలహీనుల పక్షాన నిలవడం. అదే మీడియా ధర్మం. కానీ నేడు మీడియా ప్రపంచం వేగంగా మారుతోంది. వార్తల కంటే ప్రచారానికి, వాస్తవాల కంటే వాదనలకు, ప్రజాహితం కంటే వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యం పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలకు వేదికగా ఉండాల్సిన కొన్ని మీడియా సంస్థలు రాజకీయ, కార్పొరేట్ ప్రయోజనాల ప్రచార వేదికలుగా మారుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో విలువల జర్నలిజాన్ని కాపాడుకుంటూ ప్రజా పక్షాన నిలిచిన పత్రికగా నవతెలంగాణ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ఒకప్పుడు ఒక పత్రిక చదివితే చాలు.. వాస్తవం తెలిసేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకే సంఘటనకు ఒక్కో పత్రికలో ఒక్కో కథనం, ఒక్కో విశ్లేషణ, ఒక్కో వ్యాఖ్యానం కనిపిస్తోంది. సమాచారం పెరిగింది. కానీ విశ్వసనీయ సమాచారం కోసం అన్వేషణ కూడా అంతే పెరిగింది. నాలుగైదు పత్రికలు చదివినా ఏది వాస్తవం? ఏది ప్రచారం? అనే సందిగ్ధం పాఠకుడిని వెంటాడుతోంది. ఇలాంటి కాలంలో కట్టు కథలకు, కల్పితాలకు, అతిశయోక్తులకు తావివ్వకుండా ధ్రువీకరించిన వాస్తవాలను మాత్రమే ప్రజల ముందుంచడం అత్యంత క్లిష్టమైన బాధ్యత. ఆ బాధ్యతను నవతెలంగాణ నిబద్ధతతో నిర్వర్తించింది. అందుకే ఒక అంశంపై నిజానిజాలు తెలుసుకోవాలంటే చివరికి నవతెలంగాణ ఏమి రాసిందో చూసి నిర్ధారించుకోవాలనే విశ్వాసం ప్రజల్లోనే కాదు, పాలకుల్లోనూ ఏర్పడింది. ఒక పత్రికకు దక్కే అతిపెద్ద గౌరవం ఇదే.
ప్రభుత్వానికి చప్పట్లు కొట్టడం మీడియా పని కాదు. ప్రభుత్వం చేసే మంచి పనిని ప్రజలకు చేరవేయడం ఎంత బాధ్యతో, లోపాలను ప్రశ్నించడం, బాధితుల గొంతుకగా నిలవడం, అణగారిన వర్గాల ఆవేదనను వెలుగులోకి తేవడం కూడా అంతే బాధ్యత. నవతెలంగాణ ఈ రెండు బాధ్యతలను సమతుల్యంగా నిర్వహించింది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూనే వాటి అమలులోని లోపాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లింది. ప్రశంసించాల్సిన చోట ప్రశంసించింది. ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నించింది. అదే ప్రజా పక్ష జర్నలిజం. అదే నవతెలంగాణ సంపాదకీయ వైఖరి.
గత పదకొండేండ్ల ప్రస్థానం నవతెలంగాణకు సులభం కాదు. ఆర్థిక ఒడిదుడుకులు, డిజిటల్ విప్లవం, మార్కెట్ పోటీ, సాంకేతిక సవాళ్లు, మారుతున్న మీడియా ధోరణులు.. ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అయినా ఆశయాన్ని మార్చుకోలేదు. ఒత్తిళ్లకు తలవంచలేదు. తన సంపాదకీయ స్వతంత్రతను రాజీపడనీయలేదు. ప్రజల విశ్వాసమే తన అసలైన మూలధనమని నిరూపించింది. నవతెలంగాణ పేజీలను తిరగేస్తే కేవలం వార్తలు కనిపించవు. ఒక సమాజం కనిపిస్తుంది. రైతు పంట వెనుక ఉన్న చెమట కనిపిస్తుంది. కార్మికుడి శ్రమ కనిపిస్తుంది. నిరుద్యోగ యువత ఆవేదన వినిపిస్తుంది. విద్యార్థి భవిష్యత్తుపై ఆందోళన కనిపిస్తుంది. మహిళ ఆత్మగౌరవం ప్రతిధ్వనిస్తుంది. కవి కలం, కళాకారుడి సజన, మేధావి ఆలోచన, ఉద్యమకారుడి తపన అందులో సజీవంగా నిలుస్తాయి. సబ్బండ వర్గాల సమస్యలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తూ, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, దళితులు, బహుజనులు, అణగారిన వర్గాల గొంతుకగా, ప్రజా ఉద్యమాలకు వేదికగా ఈ పత్రిక తన సామాజిక బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించింది.
ప్రజాస్వామ్యంలో అధికారానికి ఎంత విలువ ఉందో, ప్రశ్నించే కలానికి కూడా అంతే విలువ ఉంది. ప్రజల గొంతు వినిపించని చోట ప్రజాస్వామ్యం అసంపూర్ణం. అందుకే ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చెప్పిన మాటలు నేటికీ అక్షర సత్యాలుగానే నిలిచాయి. ‘పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు.. పత్రికొక్కటున్న మిత్రకోటి.. పత్రిక లేకున్న ప్రజకు రక్ష లేదు.. వాస్తవమ్ము నార్ల వారి మాట’ ఈ నాలుగు పాదాల్లోనే పత్రిక సామాజిక బాధ్యత అంతా నిక్షిప్తమై ఉంది. ప్రజల కోసం నిలిచే కలమే సమాజానికి రక్ష. వాస్తవాన్ని నిర్భయంగా చెప్పే పత్రికే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటుంది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే నవతెలంగాణ సాధించిన అతిపెద్ద విజయం.
వార్తలకే పరిమితం కాకుండా విజ్ఞానాన్ని, ఆలోచనను, చైతన్యాన్ని పంచడంలోనూ నవతెలంగాణ తన ప్రత్యేకతను చాటుకుంది. ‘సోపతి’ అనుబంధం ద్వారా సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, ప్రకృతి, ఆరోగ్యం, విద్య, కెరీర్, మానసిక వికాసం, బాలసాహిత్యం వంటి అనేక అంశాలను పాఠకులకు అందించింది. ‘జోష్’ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపగా, ‘నవ్వులు పువ్వుల్’ జీవితానికి ఆహ్లాదాన్ని జోడించింది. మేధావుల వ్యాసాలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పోరాటాల గాథలను గ్రంథరూపంలో భద్రపరుస్తూ భావితరాలకు అందిస్తుంది. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు, సమస్యలు, పోరాటాలు ఉన్నంతకాలం ప్రజా పక్ష జర్నలిజం అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని అదే నిబద్ధతతో, అదే నిజాయితీతో, అదే ధైర్యంతో నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నాను.
– గడగోజు రవీంద్రాచారి, 9848772232



