Sunday, August 9, 2026
E-PAPER
Homeసోపతిసీన్‌ రివర్స్‌ బ్రో..!

సీన్‌ రివర్స్‌ బ్రో..!

- Advertisement -

కేతిగాడు : అరె జుట్టుపోలుగా! సీన్‌ రివర్స్‌ అవుతుందిరోరు. 2020లో కోవిడ్‌ వచ్చింది. దాంతో కోవిడ్‌ ముందు ఓ ప్రపంచం, కోవిడ్‌ తర్వాత ఓ ప్రపంచం అని లెక్క కడ్తున్నారు. అలాగే మన దేశ రాజకీయాల్లో జులై 20వ తేదీ ఓ పెద్ద మార్పు. అంతకు ముందున్న రాజకీయాలు వేరు, ఇప్పుడు ఈ జెన్‌ జీ తరం నడుపుతున్న ఉద్యమాల తీరు వేరు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుత సత్యాగ్రహాలు చేయడం, తమ ధిక్కార స్వరాన్ని దృఢంగా విన్పించడం, అరాచక శక్తులు చొరపడకుండా జాగ్రత్తపడటం, ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా ఉద్యమాన్ని దీక్షగా నడపడం, ప్రాణాలకు తెగించి పాల్గొనడం, మేకులు దిగేసిన లాఠీలతో బలంగా కొట్టినా, బాష్పవాయుగోళాలు, నీటి ఫిరంగులు పేల్చినా, పెల్లుట్ల గన్స్‌ వాడినా వెరవక ధీటుగా ముందుకు సాగడం, అన్నింటికి మించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ప్రభుత్వ దుర్మార్గ చర్యలను ఎండగట్టడం – ఇవన్నీ దేశం పట్ల బాధ్యత గల ప్రతి పౌరుడ్ని గర్వపడేట్లు చేస్తున్నాయి. ‘మా దేహాలపై నెత్తురోడే దౌర్జన్య దెబ్బలు రాబోయే తరానికి సజీవ సాక్ష్యాలని చెప్పడం, యావత్‌ దేశానికే గొప్పపాఠం. అంతెందుకు జెన్‌ జీ తర్వాత పుట్టిన తరం జెన్‌ ఆల్ఫా (2010 – 2024) వారు కూడా కొనసాగింపుగా ఉద్యమించడం, పెద్దల్ని అవాక్కయ్యేలా చేస్తున్నది. ఇంటర్నెట్‌, మొబైల్‌, సోషల్‌ మీడియా వాడకం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ‘తాము చదువుకునే పాఠశాలల్లో తగినంత మంది టీచర్లు కావాలని, మంచి నీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు సక్రమంగా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రోడ్లెక్కడం పాలకులకు కంపరం పుట్టిస్తున్నది. ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో ఈ ఉద్యమం ఊపందుకుంటున్నది. మా సమస్యలు పరిష్కరించే బాధ్యులెవరు?’ అని ముక్కుపచ్చలారని బాలలు ప్రశ్నిస్తుంటే ఎవరికి ముచ్చట గొల్పదు? విషయం ఏంటంటే జిల్లా కలెక్టర్లు, అధికారులు కొందరు ఆ ఉద్యమాలను గుర్తించి, గౌరవించి, వారితో సంప్రదింపులు జరిపి పరిష్కారాలకు పూనుకోవడం చూస్తుంటే.. ఇది కదా మన భారత ప్రజాస్వామ్య ప్రగతి అని గుండెలు ఉప్పొంగుతున్నాయి. గతంలో మాదిరి ఉద్యమాలు చేసేవారిని తుకడే తుకడే గ్యాంగ్‌లు అనడం, దేశద్రోహులు, అర్బన్‌ నక్సలైట్లు అని నిందించడం, తప్పుడు కేసుల్లో ఇరికించి నిర్భందించడం… ఇలాంటి దుర్మార్గాలకు గోరీ కట్టాల్సిందేనని నినదిస్తున్నారు.

జుట్టుపోలుగాడు : అరె కేతిగా… ఊరికే సంబరపడిపోకు. ఇల్లు అలకగానే పండగ కాదు. ముందుంది ముసళ్ల పండుగ. ఈ జెన్‌ జీ గాళ్లు, ఆల్ఫాగాళ్లు ఆఫ్ట్రాల్‌ పాలపొంగు లాంటి పోరగాళ్లు. వీళ్ల లొల్లి, రాజకీయ ఆందోళన కాదు. నాయకులు లేని ఉద్యమం ఎప్పుడూ అనాథే. అది ముందు తెలుసుకో.
కేతిగాడు : అబ్బ ఆశ.. దోశ.. అప్పడం.. రాజకీయ నాయకులైతే ఆ పార్టీలను చీల్చి చెండాడడం, కొందరిని కలుపుకోవడం, మిగిలిన వారిని నయానో భయానో లొంగదీసుకోవడం, లేదంటే ఎ.సి.బి. ని ఉసిగొల్పడం. మీ పార్టీలో చేరిన బడా అవినీతి పరులకు సైతం క్లీన్‌ చిట్‌ ఇవ్వడం – ఈ బాగోతాలు ఎవరికి తెలవదు. పాపం ఈ చదువుకునే పోరాగాళ్లపై మీ పాచికలు పారకపోవడంతో బిత్తరపోతున్నారు. ఎందుకంటే వీళ్లు రాజకీయ నాయకులు కాదు కదా. మీ రాజకీయ పాలనాధికార డొల్లతనం అంతా కుప్పకూలడంతో మీకేం చేయాలో పాలుపోవడం లేదు. మీ చుట్టూ నిర్మించుకున్న మీ గోడీ మీడియా కంచు కోటను కూడా ఈ పోరాగాళ్లే తమ పదునైన సోషల్‌ మీడియా ఆయుధంతో బద్దలు కొడ్తుంటే.. మీ నాయకులు గుడ్లు తేలేస్తున్నారు.

బంగారక్క : అవును సీన్‌ రివర్స్‌ అవుతున్న జాడలు కన్పిస్తున్నాయి మావా! బీహార్‌లోని బంకీపూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్‌ విజయం అదే రుజువు చేస్తున్నది. పాతికేళ్లుగా తమకు ఎదురే లేదన్న బిజెపికి అక్కడ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు బలహీనంగా ఉండవచ్చు. కానీ నిజమైన ప్రతిపక్షం – అదే ప్రజా ఉద్యమ పక్షం చాలా బలంగా ఉన్నదని ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించడం ఎవరూ కొట్టిపారేయడానికి వీల్లేదు.

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -