Sunday, August 9, 2026
E-PAPER
Homeజాతీయంవంటింట్లో గ్యాస్, నూనె సెగ

వంటింట్లో గ్యాస్, నూనె సెగ

- Advertisement -

జులైలో వెజ్ థాలీ 4 శాతం ప్రియం
నాన్ వెజ్ థాలీ 9 శాతం భారం
కుటుంబాల బడ్జెట్ అస్తవ్యస్తం
క్రిసిల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌

‌న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జేబులకు చిల్లు పడుతోంది. పెరిగిపోతున్న జీవన వ్యయంతో సతమతమవుతున్న కుటుంబాలకు వంటింటి ఖర్చులు మరింత బాదుడు మిగులుస్తున్నాయి. ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్, వంటనూనెలు, నిత్యావసర కూరగాయల ధరలు నింగినంటుతుం డటంతో రోజువారీ భోజనం తయారీ కూడా సామాన్యుడికి తలభారంగా మారుతోందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ‘క్రిసిల్ ఇంటెలిజెన్స్’ తన నివేదికలో వెల్లడయ్యింది. గతేడాది జులైతో పోలిస్తే ఈసారి సాధారణ శాకాహార భోజనం (వెజ్‌ ‌థాలీ) తయారీ వ్యయం 4 శాతం పెరగ్గా, మాంసాహార భోజనం (నాన్‌‌వెజ్‌ ‌థాలీ) వ్యయం ఏకంగా 9 శాతం పెరిగిందని రోజురోజుకూ పెరుగుతున్న ఈ వ్యయాలు కుటుంబ బడ్జెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.

కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి..
సాధారణ కుటుంబాల్లో ప్రతీ వంటకానికి కీలకమైన ఉల్లిపాయల ధరలు ఏడాది కాలంలో ఏకంగా 20 శాతం పెరిగి సామాన్యుడికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో మహారాష్ట్రలో సంభవించిన అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా ఉల్లి పంట దెబ్బతినడం, నిల్వలు తగ్గడం ఈ ధరల మంటకు కారణమైంది. దీనికి తోడు వంటనూనెల ధరలు 11 శాతం, ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర 10 శాతం మేర పెరిగాయి. పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధ వాతావరణం, ఇంధన సంక్షోభం కారణంగా దిగుమతులు దెబ్బతిని వంట నూనె, గ్యాస్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేనంతగా ప్రియమయ్యాయి.

చికెన్‌ ‌ధరల షాక్‌..
ఆదివారం వస్తే కాస్త ప్రశాంతంగా ఇంట్లో నాన్ వెజ్ వండుకుందామనుకునే సగటు కుటుంబాలకు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. శాకాహార భోజనంతో పోలిస్తే మాంసాహార భోజన భారం దాదాపు రెట్టింపుగా ఉంది. ఉల్లి, గ్యాస్ ధరలతో పాటు బ్రాయిలర్ చికెన్ ధరలు ఏకంగా 14 శాతం పెరగడమే ఇందుకు కారణం. సాధారణంగా నాన్ వెజ్ భోజనం వ్యయంలో సగం ఖర్చు ఒక్క చికెన్‌కే అవుతుంది. చికెన్ ధరలతో పాటు మసాలాలు, నూనె, గ్యాస్ ముడిసరుకుల వ్యయం తోడవ్వడంతో మాంసాహార ప్రియుల బడ్జెట్ తలకిందులైంది.

అదుపు తప్పిన నెలాఖరు లెక్కలు..
జూన్ నెలతో పోలిస్తే జులైలోనే ఉల్లి ధరలు ఒక్కసారిగా 23 శాతం, బంగాళాదుంపల ధరలు 4 శాతం మేర పెరిగాయి. ఆదాయాలు పెరగక, ఆదాయానికి మించిన ఖర్చులతో సగటు గృహిణులు నెల గడవడం ఎలాగో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పన్నులు, ఇతర ఖర్చులతో ఇప్పటికే నలిగిపోతున్న సామాన్యుడిపై ఈ ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ కోలుకోలేని దెబ్బతీస్తోంది. పెరిగిన ఈ ధరల భారం కుటుంబాల పొదుపుపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. నెలవారీ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికి కుటుంబాలు అనేక అవస్థలు పడుతున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -