బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్
హైడ్రా డ్రైవర్ పోస్టుల భర్తీకి వచ్చిన నిరుద్యోగులను అవమానించడంపై ఆగ్రహం
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
హైడ్రాలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడ టంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 డ్రైవర్ పోస్టులకు వేలాది మంది దరఖాస్తులు చేసుకునేందుకు రావటం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పడుతోందని అన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులను ముఖ్యమంత్రి ‘క్రిమినల్ వేస్ట్’ అని అవమానించడం, ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులపై అధికారులు దుర్భాషలాడటం చూస్తుంటే “యథా రాజా.. తథా అధికారులు” అన్నట్టుగా ఉందని విమర్శించారు.
ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవంగా చూడాల్సిన అధికారులే వారినే అవమానిస్తే ఇక ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? అని ప్రశ్నించారు. ‘ ఉద్యోగం అడగడం, ప్రశ్నించటం నేరం కాదు. ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులపై అనుచితంగా, అసభ్యంగా మాట్లాడిన అధికారులపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. వారిని అవమానించినందుకు విద్యార్థి, నిరుద్యోగలోకానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.



